కేసీఆర్ గవర్నమెంట్​కు గ్యారంటీ లేదు

 కేసీఆర్ గవర్నమెంట్​కు గ్యారంటీ లేదు
  • వైన్స్​ షాపుల్లో సీఎం కుటుంబానికీ వాటా ఉంది
  • ప్రజల రక్తం తాగుతున్నరు
  • ఇయ్యాల నియోజకవర్గ కేంద్రాల్లో తిరంగా ర్యాలీ

యాదాద్రి, వెలుగు: ‘‘కేసీఆర్.. నీకు ధైర్యముంటే, పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఉప ఎన్నికలకు రా.. కొట్లాడుదాం” అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ సవాల్​ విసిరారు. ‘‘2018 ఎన్నికలు ముగియగానే.. కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్​లో చేర్చుకున్నారు. మీకు నైతిక విలువలు ఉన్నట్లయితే.. వారితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి” అని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం యాదాద్రి జిల్లా రామన్నపేటలో నిర్వహించిన సభ, మునిపంపులలో నిర్వహించిన రచ్చబండలో ఆయన మాట్లాడారు. వైన్స్ షాపుల్లో కూడా కేసీఆర్ కుటుంబానికి వాటా ఉందని ఆరోపించారు. అందుకే ఊరూరా బెల్ట్ షాపులు వచ్చాయన్నారు. కేసీఆర్ రజాకారుల వారసుడని.. ఆయన పేరును ఖాశీం చంద్రశేఖర్ రజ్వీగా, కేటీఆర్ పేరును సయ్యద్ మక్బూల్ గా అభివర్ణించారు. 

రాష్ట్ర సర్కార్ కు గ్యారంటీ లేదు 

‘‘మునిపంపులలోని రాచకాల్వ ఎప్పుడు పోతదో తెల్వదు. రాచకాల్వ పోతే దళితుల ఇండ్లన్ని పోతయి. దళితుల ఇండ్లు పోతే కేసీఆర్ పట్టించుకోడు. ఇప్పుడు రాచకాల్వకు గ్యారంటీ లేనట్టే కేసీఆర్ గవర్నమెంట్​కూ గ్యారంటీ లేదు” అని సంజయ్ అన్నారు. 8 ఏండ్లు అయినా పేదోళ్లకు ఇండ్లు కట్టియ్యని కేసీఆర్, తనకు మాత్రం ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. రామన్నపేటలోని ధర్మారెడ్డి కాల్వ, బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాలువ ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడంలేదన్నారు. ఈ కాలువల రూ. 700 కోట్లు ఖర్చు చేస్తే చాలన్నారు. రామన్నపేటలోని సర్కారు దవాఖానలో డాక్టర్లు లేరని, మందుల కొరత వేధిస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఫాంహౌజ్​లో కుక్కకు జ్వరమొచ్చినా తగ్గించడానికి డాక్టర్ ఉంటాడని, పేదలకు మాత్రం వైద్య సేవలు అందడం లేదన్నారు. రామన్నపేట రైల్వే స్టేషన్లో అన్ని ట్రైన్లను నిలిపేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషి చేస్తున్నారని, తాను కూడా రైల్వే జీఎంతో మాట్లాడుతానని చెప్పారు.  

ప్రజల రక్తం తాగుతున్నరు: సోయం 

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలందరినీ మోసం చేశారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. కేసీఆర్ ఏడేండ్లుగా ప్రజల రక్తం తాగుతున్నారని, ఈసారి అడ్డుకోకుంటే మన పిల్లల రక్తం కూడా తాగుతాడన్నారు. యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్​రెడ్డి, యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సంగ్రా యాత్రలో సోయం బాపురావుతో పాటు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. 

రామన్నపేటలో కాంగ్రెస్​ నిరసన

ప్రజా సంగ్రామ యాత్ర రామన్నపేటకు చేరుకోగానే కాంగ్రెస్ లీడర్లు నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు చెప్పినా వినకుండా ఆందోళన చేయడంతో, వారిని వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇయ్యాల నియోజకవర్గ కేంద్రాల్లో తిరంగా ర్యాలీ

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 13న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటిపై జాతీయ పతకాన్ని ఎగరేసి దేశభక్తిని చాటి చెప్పాలని సంజయ్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండా ఎగరేసేలా చూడాలని సూచించారు. గురువారం పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌‌చార్జ్‌‌లు, వివిధ మోర్చాల నాయకులతోపాటు ‘హర్ ఘర్ తిరంగా’ కోఆర్డినేటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో తిరంగా ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు.  రాష్ట్రంలో మరో 8 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్​ బియ్యాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు.