పంచాయతీ నిధులపై చర్చకు సిద్ధమా .. బీఆర్ఎస్, కాంగ్రెస్కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్

పంచాయతీ నిధులపై చర్చకు సిద్ధమా  .. బీఆర్ఎస్, కాంగ్రెస్కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్
  • డేట్, టైమ్, పంచాయతీ మీరే డిసైడ్ చేయండి
  • స్థానిక ఎన్నికలకు మీ రెండు పార్టీల నినాదం తిట్లు.. బూతులేనా
  • బీసీల నుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్

జనగామ, కరీంనగర్ వెలుగు: గత పదేండ్ల బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ 19 నెలల పాలనలో పంచాయతీలకు వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. దమ్ముంటే రెండు పార్టీలు చర్చకు రావాలని.. డేట్, టైమ్ పంచాయతీ వారే డిసైడ్ చేయాలన్నారు. శుక్రవారం ఆయన జనగామ శివారు నెల్లుట్లలోని బీజేపీ జిల్లా పార్టీ ఆఫీస్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీదే విజయమన్నారు. 

ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు వారి నినాదం తిట్లు, బూతులేనా అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో మోసపోయిన మాజీ సర్పంచులే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పనులు చేసి బిల్లులు రాక అప్పులపాలై బిచ్చమెత్తుకుంటున్నరని తెలిపారు. గ్రామాల్లో జరిగే అంతో ఇంతో అభివృద్ధి కేంద్రం ఇస్తున్న నిధులతోనే అన్నారు.  రూ.521 కోట్లతో చేపడుతున్న కాజీ పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల పర్యవేక్షణకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం వస్తున్నారని తెలిపారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్​ ఒక్కటే

కాంగ్రెస్,​ బీఆర్ఎస్​ రెండూ ఒక్కటే.. నేను కొట్టినట్టు చేస్త నువ్వు ఏడ్చినట్టు చెయ్ అనే ఒప్పందంతో పనిచేస్తున్నాయని సంజయ్ విమర్శించారు. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫామ్​హౌస్ లు, ఫార్ములా ఈ రేస్, చేపపిల్లల పంపిణీ, గొర్రెల స్కాంలో ఆధారాలున్నాయని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. స్థానిక సంస్థల్లో బీజేపీని గెలిపిస్తేనే కేంద్ర నిధులు సక్రమంగా వస్తాయని, గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. బనకచర్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నయని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినొద్దని పెద్దన్న పాత్రలో కేంద్రం అన్ని అంశాలపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిందన్నారు.

 బీసీ రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో బీసీ బిడ్డలకే కల్పిస్తే దానిని కేంద్రంతో ఆమోదింప జేసే బాధ్యత తమదన్నారు. అందులో ముస్లింలకు కూడా కొంత కేటాయిస్తామంటే ఒప్పుకోమన్నారు. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ ద్వారా 10 శాతం లబ్ధి పొందుతున్న ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ‘‘నీచంగా ఫోన్​లు ట్యాప్​ చేయించిన కేసీఆర్ లాంటి ఛండాలమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. నా ఫోన్ ను, నా పీఏ, పీఆర్వో, డ్రైవర్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటున్నరు” అని మండిపడ్డారు. 

నాకు గ్రూపులు ఆపాదించొద్దు

బీజేపీలో ఏ గ్రూపు లేదని, ఉన్నదల్లా మోదీ గ్రూప్ మాత్రమేనని సంజయ్ అన్నారు. దయచేసి తనకు గ్రూపులు ఆపాదించొద్దని, ఎవరైనా బండి సంజయ్ గ్రూప్ అని, మరో గ్రూపు వాళ్లమని ప్రచారం చేసుకుంటే వారికి టిక్కెట్లు కూడా రావని హెచ్చరించారు.