బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం టీఆర్ఎస్ సంతాప సభలా ఉంది : బండి సంజయ్ 

బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం టీఆర్ఎస్ సంతాప సభలా ఉంది : బండి సంజయ్ 

జగిత్యాల జిల్లా : బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వెళ్లిన ఇతర రాష్ట్రాల నేతలంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వ్యక్తులంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం టీఆర్ఎస్ సంతాప సభలా ఉందన్నారు. తమ కూతురుని అరెస్ట్ చేస్తారనే భయంతో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి కేసీఆర్ లబ్ది పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ చెల్లని రూపాయిగా మారారని, ఆయన ముఖం చూసి ఓట్లేసే రోజులు పోయాయని చెప్పారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ లో  నిర్వహించిన పాదయాత్ర రోడ్ షోలో బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. 

ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు కేసీఆర్ నయాపైసా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లోని సర్పంచులు తమ ఆస్తులను అమ్ముకుని అడుక్కునే దుస్థితి ఏర్పడిందన్నారు. నిధులు మంజూరు చేయకుండా గ్రామాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశమిస్తే పేదోళ్ల రాజ్యం తీసుకొస్తామన్నారు.

 సీఎం కేసీఆర్ ఐలాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాడా..? ఇక్కడి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఐలాపూర్ గ్రామస్తులు చాలా చైతన్యవంతులన్నారు. దేశ పర్యటనల పేరుతో కేసీఆర్ అటే వెళ్తారని, ఇక తిరిగిరాడంటూ వ్యాఖ్యానించారు. పద్మశాలీలకు ఖాదీబోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది నుంచి ప్రజల కోసమే తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. నిరుపేదల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టానని వివరించారు. పాదయాత్రలో తాము తెలుసుకున్న అన్ని అంశాలను రాబోయే ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు లేవని, తాము ఓట్ల కోసం రాలేదన్నారు. 

వేములవాడకు రూ.100 కోట్లు, బాసరకు రూ.120 కోట్లు ప్రకటించిన కేసీఆర్.. ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా..? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించడం కూడా హాస్యాస్పదమన్నారు. కొండగట్టుకు ఇంతవరకు వెళ్లని కేసీఆర్..అక్కడే కుర్చీ వేసుకుని రూ.100 కోట్ల పనులు చేయిస్తాడా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను తరలించారని, వారితో కుర్చీలు మోయించడంతో పాటు అన్ని పనులు చేయించారని ఆరోపించారు. గత ఎనిమిదేళ్లలో నష్టపోయిన ఏ ఒక్క రైతుకైనా నష్టపరిహారం చెల్లించారా..? అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేయడం లేదన్నారు. పంజాబ్ లో కేసీఆర్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి నెలకొందన్నారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా కేసీఆర్ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎరువులపై రైతులకు కేంద్రమే సబ్సిడీ ఇస్తోందన్నారు. రైతుబంధు పేరుతో రైతులకు అన్ని సబ్సిడీలను కేసీఆర్ నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు పుట్టి..పెరిగి పెద్దగవుతున్నా కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అర్హులకు రావడం లేదన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. కారు గుర్తుకు ఓట్లు వేస్తేనే పంచాయతీలకు నిధులు ఇస్తానన్న కేసీఆర్... ఇప్పటికీ ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. ఐలాపూర్ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద భారీగా నిధులను మంజూరు చేశామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులతో కేసీఆర్ తన ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 

కేంద్ర ప్రభుత్వమే వరి ధాన్యం సేకరిస్తోందని బండి సంజయ్ చెప్పారు. సన్న వడ్లు.. దొడ్డు వడ్లు అంటూ కేసీఆర్ రైతులను ఆగం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఫ్రీ కరెంటు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. డిస్కంలు రూ.60 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. డిస్కంలకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి చెల్లించాల్సిన బిల్లులే రూ.18 వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామానికైనా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టయితే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఒకవేళ ఇవ్వకుంటే కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అని ప్రశ్నించారు. 

దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మాత్రం పైసలు ఉండవని, దోచుకోవడానికి మాత్రం పైసలు ఉంటాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. క్యాసినోలో కూడా లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టారని, ఆ విషయం కూడా త్వరలోనే బయటపడుతుందన్నారు. రాష్ట్రాన్ని  టీఆర్ఎస్ నాయకులు దోచుకు తింటున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ ఒక్కటే అని బండి సంజయ్ అన్నారు. ఖాదీ బోర్డు స్థలాల్లో కమర్షియల్ పెట్రోల్ బంకులు వెలుస్తాయా..? అని ప్రశ్నించారు. అమ్ముకోడానికి, లీజుకు తీసుకోవడానికి ఖాదీ బోర్డును వాడుకుంటారా..? అని మండిపడ్డారు. ఐలాపురం మండలం కావాలంటే.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే.. రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడుతామని చెప్పారు.