మోదీ లేని భారత్ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదు : బండి సంజయ్

మోదీ లేని భారత్ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదు : బండి సంజయ్

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నినాదంతో జరగబోతున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఏ సంస్థ సర్వే చేసినా 80 శాతానికిపైగా ప్రజలు మోదీనే మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. మోదీ లేని భారత్ ను ప్రజలెవరూ ఊహించుకోవడం లేదన్నారు.   తెలంగాణలో బీజేపీ 8 నుండి 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులు బాగోలేవన్నారు బండి సంజయ్.. ఉద్యోగుల జీతాలకు కూడా పైసల్లేవని విమర్శించారు.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో సహా.. కొత్తగా ఇస్తున్న హామీల అమల సంగతి దేవుడెరగని చెప్పారు.  తెలంగాణలోనూ ఈసారి పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ మూడోవ స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు.  పొరపాటున ఎవరైనా బీఆర్ఎస్ కు ఓటేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని చెప్పారు.  

గల్లీలో, ఢిల్లీలో అధికారంలో లేని బీఆర్ఎస్ ఒకవేళ ఆ పార్టీ ఎంపీలు గెలిచినా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు బండి సంజయ్ .  బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి  రాష్ట్రానికి అదనపు నిధులు తెస్తామని హామీ ఇచ్చారు.  ఎన్నికల్లో కష్టపడ్డ వారికే స్థానిక సంస్థల టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు.  పార్టీలో ఉంటూ విష ప్రచారం చేసే వారి సంగతి అధిష్టానం  చూసుకుంటదని హెచ్చరించారు.  కరీంనగర్ లో అతి త్వరలో 20 వేల మందితో క్షేత్రస్థాయి కార్యకర్తల సమ్మేళనం ఉంటుందని సంజయ్ తెలిపారు.