వివేక్ లాంటి లీడర్ కోసమే చూస్తున్నం: బండి సంజయ్

వివేక్ లాంటి లీడర్ కోసమే చూస్తున్నం: బండి సంజయ్

వివేక్​ చేరికతో బీజేపీ బలోపేతం: ఎంపీ బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు​: ‘వివేక్ లాంటి మంచి నాయకుడి కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాం.. ఆయన రాకతో  బీజేపీ మరింత బలోపేతం అవుతుంది.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కలిసిపనిచేస్తాం..’ అని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ పేర్కొన్నారు. ఇటీవలే పార్టీలో చేరిన పెద్దపెల్లి మాజీ ఎంపీ గడ్డం వివేకానందను సోమవారం హైదరాబాద్​లోని ఆయన స్వగృహంలో సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. వివేక్​ లాంటి సీనియర్ నాయకుడు  పార్టీలోకి రావడం తమకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముందుండి పోరాడిన నాయకుల్లో కాకా వెంకట స్వామి ఒకరనీ, ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్, తనదైన ముద్ర వేశారని సంజయ్​ కొనియాడారు. ఆయనతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని ఎంపీ చెప్పారు.  ప్రస్తుతం టీఆర్​ఎస్​పై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందనీ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, సీఎం అహంకారపూరిత వైఖరిపై ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇటీవలి ఆర్టికల్ 370 రద్దు లాంటి ముఖ్యమైన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. కేసీఆర్ లాగా అధికారం కోసం, ఆర్థిక లబ్ధి కోసం  కాకుండా పేదల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామన్నారు. ఎంపీ వెంట బీజేపీ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టె మురళీకృష్ణ, కరీంనగర్ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.