యువత రాజకీయాల్లోకి రావాలి: బండి సంజయ్

యువత రాజకీయాల్లోకి రావాలి: బండి సంజయ్
  • లేకపోతే కుటుంబ వారసత్వం కొనసాగే ప్రమాదముంది
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌

కరీంనగర్, వెలుగు : ‘సర్దార్‌‌ వల్లభాయ్‌‌ పటేల్‌‌ ఆశయసాధన కోసం యువత రాజకీయాల్లోకి రావాలి, నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి’ అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌కుమార్‌‌ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి రాకుంటే కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగే ప్రమాదం ఉందని, ఇది దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. ఉక్కు మనిషి సర్దార్‌‌ వల్లభాయ్‌‌ పటేల్‌‌ 150వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో సోమవారం కరీంనగర్‌‌లోని ఎస్సార్‌‌ కాలేజీ నుంచి స్టూడెంట్లు నిర్వహించిన యూనిటీ మార్చ్‌‌లో ఆయన పాల్గొన్నారు. 

అనంతరం బండి సంజయ్‌‌ మీడియాతో మాట్లాడుతూ... దేశ ఐక్యత కోసం వల్లభాయ్‌‌ పటేల్‌‌ తన జీవితాన్ని ధారపోశారని, 560 సంస్థానాలను ఒకే జెండా కిందికి తీసుకొచ్చారని కొనియాడారు. యువత డ్రగ్స్, మద్యం, పబ్‌‌ కల్చర్‌‌కు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీచర్, గ్రాడ్యుయేట్‌‌ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, కలెక్టర్‌‌ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, మాజీ మేయర్‌‌ సునీల్‌‌రావు పాల్గొన్నారు.

సౌదీ దుర్ఘటనపై బండి దిగ్బ్రాంతి 

మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 42 మంది చనిపోవడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన విదేశాంగ శాఖ, హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని, సౌదీలోని భారత దౌత్యవేత్తలు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలను అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.