ఫారెస్ట్ అధికారి హత్యకు సీఎం కేసీఆరే బాధ్యత: బండి సంజయ్

ఫారెస్ట్ అధికారి హత్యకు సీఎం కేసీఆరే బాధ్యత: బండి సంజయ్

పోడు భూముల వ్యవహారంలో ఫారెస్ట్ అధికారులకు, ప్రజల మధ్య  కేసీఆర్ చిచ్చు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఫారెస్ట్ అధికారి హత్యకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. సాధారణ ఎన్నికలతో పాటు...ఉప ఎన్నికల్లో పోడు భూములను పరిష్కరిస్తామని  ప్రజలను కేసీఆర్ వంచనకు గురిచేశారని మండిపడ్డారు.  పంటలు పండేదాకా చూసి  వాటిని చెడగొట్టాలని కేసీఆరే ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్యను కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం కూడా  కేసీఆర్ చేస్తారని ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన బండి సంజయ్..దివ్యాంగులకు రూ. 3.5 కోట్ల ఉపకరణాలను అందజేశారు. 

అధికారులకు పార్టీలకు సంబంధం ఉండదు..

అక్రమంగా సంపాదించిన వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదులు అందితే..తనిఖీ చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని బండి సంజయ్ అన్నారు. అధికారులు సోదాలు నిర్వహిస్తే సహకరించాల్సింది పోయి కేంద్రంపై నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. అధికారులకు పార్టీలకు సంబంధం ఉండదన్న కనీస జ్ఞానం కూడా లేదని ఎద్దేవా చేశారు. తప్పు చేయనప్పుడు అధికారులకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.  పేదలను దోచుకున్న వారిని  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుందని చెప్పారు. 

న్యాయవ్యవస్థపై నమ్మకముంది..

ఫాంహౌజ్ కేసులో నోటీసుల జారీపై న్యాయపరంగా కొట్లాడుతామని బండి సంజయ్ తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు. అటు లిక్కర్ స్కామ్ లో సీఎం కుటుంబ సభ్యుల పాత్ర పై దేశవ్యాప్త చర్చ జరుగుతున్నప్పకీ...కేసీఆర్ మాత్రం ఇప్పటికీ స్పందించలేదన్నారు.