రాహుల్, కేటీఆర్ మా బ్రాండ్ అంబాసిడర్లు : బండి సంజయ్

రాహుల్, కేటీఆర్ మా బ్రాండ్ అంబాసిడర్లు  : బండి సంజయ్
  • ‌‌వీరు ఉన్నంత కాలం అధికారం మాదే : బండి సంజయ్
  • ‌‌దేశానికి రాహుల్.. తెలంగాణకు కేటీఆర్ ఐరన్ లెగ్స్
  • ‌‌జూబ్లీహిల్స్​లో జరిగిన్న తప్పిదాలపై సమీక్షిస్తం
  • ‌‌బెంగాల్, తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: దేశానికి ఐరన్ లెగ్ రాహుల్ గాంధీ అయితే.. తెలంగాణకు ఐరన్ లెగ్ కేటీఆర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాహుల్ గాంధీ, కేటీఆర్ తమ బ్రాండ్ అంబాసిడర్లని, వారు ఉన్నంత కాలం అధికారం తమదేనని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ గురించి మాట్లాడుకునే టైమ్ కాదని, చిన్న చిన్న తప్పిదాలు జరిగాయని, వాటిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేఎల్​పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

బిహార్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్ ఆడుకోవడానికి పరిమితమవుతాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ పతనం కొనసాగుతూనే ఉందన్నారు. కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలను కోల్పోయిన తర్వాత కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. 

బిహార్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ జరిగిందని, ఓట్ చోరీ అని కాంగ్రెస్ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు దాన్ని నమ్మలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ 60 స్థానాల్లో పోటీచేస్తే.. 5 స్థానాలు గెలిచిందని, మహాగఠ్​ బంధన్ మొత్తం 34 సీట్లకే పరిమితమైందన్నారు. ఎన్డీయే కూటమికి మొత్తం 200కు పైగా స్థానాలు దక్కాయని,  101 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 92 స్థానాల్లో విజయం సాధించిందని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే భవిష్యత్తులో తెలంగాణలో అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తంచేశారు.

ఎంఐఎం వల్లే జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్ గెలుపు

జూబ్లీహిల్స్​లో ఎంఐఎం స్వతహాగా గెలవలేక కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి ఎన్నికలకు వెళ్లిందని బండి సంజయ్ అన్నారు. ముస్లింల ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచిందన్నారు. హిందువులను చైతన్యం చేసి రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు. తాము ఏం చేయకున్నా ప్రజలు గెలిపిస్తారనే ధీమాతో కాంగ్రెస్ నేతలు ఉంటారని, ఇక గెలుపు అయిపోయింది కాబట్టి ఏ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదని ఆరోపించారు.