- బోనాలు, సిగాలతో ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి
మెదక్, పాపన్నపేట, వెలుగు: మెదక్జిల్లాలో ఏడుపాయల జాతర సంబురంగా జరుగుతోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర నుంచి తండోప తండాలుగా భక్తులు తరలివచ్చారు. మంజీరా నదీ పాయల్లో పవిత్ర స్నానాలు చేసి రాతి గుహలో కొలువైన వనదుర్గా మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంగళవారం రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద స్వామి వనదుర్గామాతను దర్శించుకున్నారు. రంగురంగుల పటాలు, బోనాల ఊరేగింపులు, శివసత్తుల సిగాలు, పోతరాజుల విన్యాసాలతో జాతరలో అడుగడుగునా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోంది.
దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు టెంపరరీ గుడారాలు ఏర్పాటు చేసుకుని బస చేశారు. మేకలు, కోళ్లు కోసుకుని దావత్లు చేసుకుంటున్నారు. భక్తులు జాయింట్వీల్, డిస్కో డ్యాన్స్ఎక్కి, పెద్ద సంఖ్యలో వెలసిన దుకాణాల్లో నచ్చినవి కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి వేళ సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి రామచంద్రరాజు ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి.
