దళితబంధు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదు

దళితబంధు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదు

సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను సరైన సమయంలో టచ్ చేస్తామన్నారు. దళితబంధు అమలు చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుదని  హామీ ఇచ్చారు. దళితులకు రూ. 10 లక్షలు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదని సంజయ్ హెచ్చరించారు.  దళితబంధును రాష్ట్ర మంతా అమలు చేసేవరకు కేసీఆర్ ను నిద్రపోనిచ్చేది లేదన్నారు. అంతేకాదు..దళితుడిని సీఎం చేసే వరకు కేసీఆర్ పై పోరాటం ఉంటుందన్నారు. దళితులు ఓట్లు వేయకుంటే రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా? అని  ప్రశ్నించారు బండి సంజయ్. దళితబంధు కావాలో.. వద్దో ఎస్సీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని సంజయ్ సూచించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టిన రోజు కేసీఆర్ ఎందుకు సభలో లేడు? అని ఆయన ప్రశ్నించారు. 

వర్షకాలంలో పండిన వరి ధాన్యాన్ని కొంటాడో లేదో కేసీఆర్ చెప్పాలని.. కేసీఆర్ బూతు మాటలు విని తెలంగాణ సమాజం తల దించుకుంటోందన్నారు సంజయ్. పేదల కోసం  తల‌ నరుక్కోవటానికి తాను సిద్ధమని, కేసీఆర్ సిద్ధమా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను తరిమి కొట్టటానికి కంకణం కట్టుకున్నామని స్పష్టం చేశారు. అంబేద్కర్‌ విగ్రహం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడో చెప్పాలని  డిమాండ్ చేశారు సంజయ్.