కిషన్ రెడ్డికి చోటు దక్కడం సంతోషకరం: బండి సంజయ్

కిషన్ రెడ్డికి చోటు దక్కడం సంతోషకరం: బండి సంజయ్

కేంద్ర కేబినేట్ లో తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి తన ట్విటర్ పోస్ట్ ద్వారా తెలిపారు. ఆయనకు కేబినేట్ లో చోటు దక్కినందుకు తెలంగాణ బీజేపీ శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినేట్ లో కిషన్ రెడ్డి ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ.. పార్టీ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించిన కిషన్ రెడ్డికి గుర్తింపు దక్కిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి తప్పని సరి అని అన్నారు.

ఈ రోజున తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తుందని , కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఫోటోలు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటున్నారన్నారు. ప్రజలని మోసం చేస్తున్న ఈ విధానాన్ని అడ్డుకోవాలంటే తప్పకుండా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావాలని కోరారు.

కేబినేట్ లో మంత్రి పదవి మీకే ఇస్తారని ప్రచారం జరిగింది కదా  అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్… సోషల్ మీడియాలో ఈ విషయమ్మీద తప్పుడు ప్రచారం జరుగుతుందని,.. తనకు మంత్రి పదవి మీద ఎలాంటి అత్యుత్సాహం, ఆశ లేదని బదులిచ్చారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కూడా.. పార్టీ  తనను నమ్మి ఎంపీ టికెట్ ఇచ్చిందని, అలాంటి పార్టీ ఏ బాధ్యతను అప్పగించినా సమర్ధవంతంగా పని చేస్తానని అన్నారు. బీజేపీ తరపున గెలిచిన తాను.. పార్టీ సేవకే సమయం కేటాయిస్తానని బండి సంజయ్ అన్నారు.

ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ తరపున నలుగురు ఎంపీలు గెలిచారని, కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని గ్రామాల వరకు అమలయ్యేలా చూస్తామని సంజయ్ ఈ సందర్భంగా అన్నారు.

Bandi sanjay feeling happy about Kishan reddy