
బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ఫైర్
ఫీజుల దోపిడీపై యువ మోర్చా ఆధ్వర్యంలో పోరాటం చేయాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా సర్కార్ పనితీరులో మార్పు రాలేదని విమర్శించారు. గవర్నమెంట్ హాస్పిటళ్లలో సరైన సౌలతులు కల్పించకపోవడంతో, కరోనా బాధితులు ప్రైవేట్ కు పరుగులు పెడుతున్నారని అన్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షల ఫీజులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో రాష్ట్ర కార్యవర్గ నేతలతో సంజయ్ సమావేశమయ్యారు. కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లమేనేజ్ మెంట్స్ కరోనా పేరుతో రూ.లక్షల్లో దోచుకుంటున్నాయని సంజయ్ మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఉండాల్సింది పోయి, డబ్బులు సంపాదించడంపైనే దృష్టి సారించడం దురదృష్టకరమన్నారు. హాస్పిటల్ మేనేజ్ మెంట్స్ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీపై యువ మోర్చా ఆధ్వర్యంలో పోరాటం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు. కరోనా బాధితులకు అండగా నిలవాలని సూచించారు. కరోనా విషయంలో సర్కార్ సరైన విధంగా స్పందించకపోవడంతోనే వైరస్ వ్యాప్తి పెరిగిందని ఆరోపించారు. సమావేశంలో బండ్రు శోభారాణి, బంగారు శ్వేత, ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేనేతకు కేంద్రం చేయూత…
ఉపాధి రంగాల్లో చేనేత మన దేశంలోనే రెండో స్థానంలో ఉందని బండి సంజయ్ అన్నారు. ఈ రంగం 43 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చేనేత అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తోందన్నారు. ఈసారి బడ్జెట్ లో టెక్స్ టైల్ మినిస్ట్రీకి రూ.3,514 కోట్లు కేటాయిస్తే, అందులో చేనేత రంగానికి రూ.485 కోట్లుకేటాయించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేతన్నల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రూ.1,000 కోట్లతో చేనేత కార్పొరేషన్, రీసెర్చ్ ఇని స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా చేనేత కళాకారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కు సౌలతులు కల్పించాలని కోరారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వారి పిల్లలను ప్రభుత్వ ఖర్చుతో చదివించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.