రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరు

రాష్ట్రంలో  కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరు

కేసులకు, అరెస్టులకు, జైల్ లకు బీజేపీ భయపడదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆర్టీసీ ఛార్జీల పెంపు నేపథ్యంలో  జేబీఎస్ లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో ముఖాముఖికి బీజేపీ నేతలు ప్లాన్ చేయగా.. ముందస్తుగా బండి సంజయ్ ని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్, అధికార పార్టీ టీఆర్ఎస్, ఎంఐఎంలపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్ర మోడీ 8 ఏండ్ల పాలన లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలను కింది స్థాయిలో తీసుకుపోవడానికి ఈ కార్యక్రమంను రాష్ట్రంలో తీసుకువచ్చామని తెలిపారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే  పార్టీ బీజేపీ అన్న బండి సంజయ్.... బీజేపీ కార్యకర్తలు కష్టపడి పని చేయడం వల్లనే దేశంలో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. గతంలో 2 సీట్లు ఉన్న బీజేపీ.. ఇప్పుడు  దేశంలో అధికారంలోకి వచ్చిందన్నారు.  400 సీట్లు ఉన్న కాంగ్రెస్ 40 సీట్లకు పడిపోయిందని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామ మందిరం నిర్మాణం, ముస్లిం మహిళల హక్కుల కోసం ట్రిబుల్ తలాక్ ను రద్దు చేశాని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. మోడీ 8 ఏండ్ల పాలనపై మేము చర్చ చేస్తున్నామని.. కేసీఆర్ నీ 8 ఏండ్ల పాలనపై చర్చ పెట్టు. మేము చర్చకు రెడీ అంటూ సవాల్ చేశారు. 

"ఈరోజు 10 వ తేది. ఇప్పటి వరకూ కొంత మందికి జీతాలు పడలేదు. మద్యం ద్వారానే ప్రభుత్వం నడిపించాలని చూస్తోంది.60 శాతం ఆదాయం  రాష్ట్రానికి మద్యం ద్వారానే వస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తుంటే మమ్ముల్ని అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏమి చేసిండని  దేశాన్ని ఏలుతడట ? రైతులకు రైతు బంధు ఇచ్చి.. మిగతావన్నీ కట్ చేసిన దుర్మార్గుడు కేసిఆర్" అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు.

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసం ఛార్జీలు, సేస్ ఛార్జీలు పెంచుతున్నాడని, ఆర్టీసీనీ నష్టాల్లోకి నెట్టి ప్రయివేటీకరణ చేయాలని చూస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్ లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. "ఎంఐఎం పార్టీ ముస్లింల కోసం పని చేయడం లేదు. ఎంఐఎం కుటుంబం కోసం పని చేస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంతో టీఆర్ఎస్ ఎందుకు జత కడుతుంది. ఎవ్వరు అధికారంలో ఉంటే వారికి ఎంఐఎం అండగా ఉంటుంది. అధికారంలో ఉన్న ప్రతీ పార్టీతో అంటుకడుతున్న ఎంఐఎం ఓల్డ్ సిటీనీ ఎందుకు అభివృద్ధి చేయలేద"ని బండి సంజయ్ ప్రశ్నించారు.

గోకుల్ చాట్, సాయిబాబా గుళ్లో బాంబులు పెట్టింది ఎవరో తెలంగాణ సమాజానికి తెలుసు. జూబ్లీ హిల్స్ మైనర్ రేప్ ఘటనపై నిందితులను అరెస్ట్ చేయాలని బండి డిమాండ్ చేశారు. బీజేపీ పోరాటం చేయడం వల్లనే నిందుతులను అరెస్ట్ చేశారన్న ఆయన... హత్యలు, అత్యాచారాలు చేయడంలో టీఆర్ఎస్, ఎంఐఎం పోటీ పడుతున్నాయని ఆరోపించారు. ఇన్ని ఘోరాలు  జరుగుతుంటే సీఎం కేసిఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో పండుకున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరన్న ఆయన.. చివరకు  వెలమలు కూడా సంతోషంగా లేరని అన్నారు. "రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఉత్తరప్రదేశ్ లో యోగికి అవకాశం ఇవ్వటం వలన కఠిన నిర్ణయాలు అమలు చేశారు. ఇక్కడ కూడా బీజేపీకి అవకాశం ఇవ్వండి. కఠిన నిర్ణయాలు అమలు చేస్తా"మని బండి సంజయ్ అభ్యర్థించారు.