రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ జీవోపై సంజయ్​ ఫైర్​

రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ జీవోపై సంజయ్​ ఫైర్​
  • లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకే 
  • రెండు నెలల క్రితమే జీవో ఇస్తే ఎందుకు బయటపెట్టలే 
  • తప్పు చేసిండు కాబట్టే ప్రమాణం చేసేందుకు రాలే 
  • కేంద్రం వడ్ల పైసలు ఇస్తలేదని, మోటార్లకు మీటర్లు పెట్టిందని నిరూపిస్తవా? అని సవాల్

నల్గొండ, వెలుగు: సీఎం కేసీఆర్​కు సీబీఐ భయం పట్టుకుందని, లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకే జీవో 51 తెచ్చారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండు నెలల క్రితమే జీవో ఇస్తే ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఆదివారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సిగ్గు లేకుండా బీజేపీపై ఆరోపణలు చేసిన కేసీఆర్... ప్రమాణం చేసేందుకు యాదాద్రికి రమ్మంటే ఎందుకు రాలేదని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టే ప్రమాణం చేయడానికి రాలేదని, అందుకే సీబీఐ ఎంక్వైరీకి ఒప్పుకోవడం లేదని సంజయ్​ అన్నారు. ‘‘ఈ కేసులో దాగిన కుట్రను బయటపెట్టేందుకు మేం కోర్టుకు వెళ్తే, విచారణ జరపొద్దని కౌంటర్ వేయాల్సిన అవసరం ఏం వచ్చింది. ఎలాంటి తప్పు చేయనప్పుడు విచారణ జరిపించడానికి అభ్యంతరం ఏంటి? కోర్టులు, పోలీసులు, సీబీఐ, ఈడీ మీద కేసీఆర్​కు నమ్మ కం లేదు. అసలు ఆయనపై ఆయనకే నమ్మకం లేకుండా పోయింది” అని మండిపడ్డారు. 

ప్రమాణం చేసేందుకు సిద్ధమా?

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిండో మహేందర్ రెడ్డిని అడిగితే చెప్తారని, మరో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎంతకు అమ్ముడుపోయిండో తుమ్మల నాగేశ్వరరావును అడిగితే బయటపడుతుందని సంజయ్ చెప్పారు. ‘‘ మా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. 2014 నుంచి ఇప్పటి వరకు నీ పార్టీలో చేరిన 36 మంది ఎమ్మెల్యేలతో నువ్వెందుకు రాజీనామా చేయించలేదు? నీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎన్ని డబ్బులు ఇచ్చి, ఏ ప్రలోభాలు చూపి చేర్చుకున్నావ్” అని కేసీఆర్​ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయకుంటే ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మునుగోడు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేయలేదు. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఎలాంటి కుట్రలు లేవు అని బహిరంగంగా ప్రమాణం చేయాలి. నలుగురు ఎమ్మెల్యేలు, నీ కొడుకు, అల్లుడికి ప్రమాణం చేసే దమ్ముందా?” అని సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న ఎస్పీ, కలెక్టర్లను బెదిరిస్తున్నారని.. మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించకపోతే ఏసీబీ కేసులు పెట్టిస్తామని, బదిలీ చేస్తామని, లూప్​లైన్​లో వేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు.  

కేసీఆర్ కు మర్యాద ఎక్కడుంది? 

అధికారంలో లేని తమపై చార్జ్​షీట్​ఎందుకు వేశారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. మునుగోడుకు కేసీఆర్ చేసిన మోసాలపై చార్జ్ షీట్ వేయాలని అన్నారు. నూలు రంగులపై 50 శాతం సబ్సిడీ ఏమైందని, చేనేత బంధు స్కీమ్ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. ‘‘మునుగోడులో నడ్డా సభ గురించి మీకెందుకు? మీ లాంటి చిల్లరగాళ్లకు బదులు చెప్పాల్సిన అవసరం లేదు” అని టీఆర్ఎస్సోళ్లపై మండిపడ్డారు. సోమ, మంగళవారాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలతో కేసీఆర్​ దిమ్మతిరిగి పోతుందన్నారు. కేసీఆర్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, గల్లీ స్థాయి లీడర్​కు దక్కే మర్యాద ఆయనకు దక్కడం లేదని విమర్శించారు. యాదాద్రి టెంపుల్ ను సంప్రోక్షణ చేయాలని కేటీఆర్ మాట్లాడుతున్నారని.. అదేమైనా ఆయన అయ్యదా? తాతదా? అని ఫైర్ అయ్యారు. 

మునుగోడు ఎన్నికే బీఆర్ఎస్​కు సమాధి రాయి 

మునుగోడు ఎన్నిక టీఆర్ఎస్, బీఆర్ఎస్​కు సమాధిరాయి కాబోతున్నాయని సంజయ్ అన్నారు. ‘‘చండూరు సభకు టోపీ పెట్టుకొని వచ్చిన కేసీఆర్.. మునుగోడు ప్రజలకు టోపీ పెట్టారు. నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజిక వర్గాలుంటే, వాళ్ల గురించి సభలో ప్రస్తావించనేలేదు. మునుగోడుకు గతంలో ఇచ్చిన హామీలపై మాట మాట్లాడలేదు. ఎనిమిదేండ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని కేసీఆర్.. గెలిపిస్తే 15 రోజుల్లో ఎలా చేస్తారు” అని ప్రశ్నించారు. ‘‘సూడు సూడు నల్గొండ..’’ అనే పాట కేసీఆర్ రాయలేదని, అది కోదాటి శ్రీను రాశారని చెప్పారు. శివన్నగూడెం ప్రాజెక్టు, రోడ్లు చిన్న సమస్యలైతే ఎనిమిదేండ్లుగా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ‘‘శివన్నగూడెం రిజర్వాయర్ పనులను కేంద్రం ఆపిందని చెప్పిన కేసీఆర్..​ ఇప్పుడేమో 15 రోజుల్లో పూర్తి చేస్తానని కథలు చెప్తుండు. దాంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోథల స్కీమ్ ఏమైంది” అని అడిగారు. టీఆర్ఎస్​కు టీఎన్జీవో నాయకులు మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. ‘‘కేంద్రం వడ్లు కొనడం లేదని, పైసలు ఇవ్వడం లేదని కేసీఆర్ అంటున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టిందని చెబుతున్నారు. ఇవన్నీ నిరూపిస్తరా? దమ్ముంటే ప్రమాణం చేస్తరా?” అని సంజయ్​ సవాల్ విసిరారు.