కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి నష్టం: బండి సంజయ్

కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి నష్టం: బండి సంజయ్

పాలమూరు, వెలుగు: కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో ఒప్పందం చేసుకున్న మూర్ఖుడు కేసీఆర్​అని, ఆయన వల్లే తెలంగాణ నష్టపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ బండారాన్ని తాము అప్పట్లోనే అన్ని  ఆధారాలతో బయటపెట్టామన్నారు. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఎందుకు స్పందించలేదో చెప్పాలని నిలదీశారు.

ఆదివారం మహబూబ్​నగర్​లోని బీజేపీ ఆఫీస్​లో సంజయ్ మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో పది స్థానాలకు మించి గెలుస్తుందని, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. క్యాడర్ లేని కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఏ ఒక్కరోజు  పోరాటాలు చేయలేదని, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుల రాష్ట్రంగా మారిన తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, కేంద్ర నిధులు రాష్ట్రానికి రావాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపించాలని కోరారు.  బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లేనని, ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీది మూడో స్థానమేనన్నారు.  కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బండారు శృతి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.