
కేంద్రాన్ని తిట్టడమే తప్ప రైతులకు కేసీఆర్ చేసింది ఏమిటి అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 8 ఏళ్లుగా పంట నష్టపోయిన రైతులకు కేసీఆర్ పరిహరం ఇచ్చారా అని నిలదీశారు. రైతుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్.. కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గుచేటున్నారు. కేసీఆర్ అహంకారాన్ని అణిచివేసి ఫామ్ హౌస్ నుంచి పొలం వరకు తీసుకొచ్చిన ఘనత బీజేపీదేనని చెప్పారు. తక్షణమే సమగ్ర పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. రైతులకు మేలు చేయాలని ఉంటే ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పారు.
ఫసల్ బీమా యోజన అమలైతే రైతులకు లాభం కలిగితే ఆ మంచి పేరు కేంద్రానికి పోతుందన్న దురుద్దేశంతోనే రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న టైమ్ లో కేసీఆర్ కు రైతులు గుర్తుకువచ్చారా అని ఎద్దేవా చేశారు. ఎకరానికి రూ.10 వేలు సరిపోవని, రైతులకు పెట్టుబడి ఖర్చులకు కూడా రావని అన్నారు. మరోవైపు పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపకుండా .. కేంద్రాన్ని అడగడమే దండగనడం సిగ్గుచేటని విమర్శించారు. రైతుల పక్షాన పోరాడాల్సిన కమ్యూనిస్టులు అధికార పార్టీకి భజన చేయడం విచారకరమని సంజయ్ తెలిపారు.