బీసీలను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నాడు

బీసీలను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నాడు

హైదరాబాద్: బీసీలను సీఎం కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆత్మగౌరవ భవనాల పేరుతో బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ భవనాలకు ఇచ్చిన భూముల్లో గడ్డి మొలిచిందే తప్ప …. ఒక్క పని జరగలేదన్నారు. 9 నెలల్లో ప్రగతి భవన్ కట్టుకున్న ముఖ్యమంత్రి ఆత్మగౌరవ భవనాలు ఎందుకు కట్టరని ప్రశ్నించారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో కుల సంఘాలకు కేటాయించిన స్థలాలను ఆయన పరిశీలించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఉప్పల్ భాగాయత్ నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని అన్నారు. టీఆరెస్ మునిగిపోయే నావ అని, ప్రజలకు ఆ పార్టీని స్క్రాప్ చేసే అవకాశం వచ్చిందిని అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎన్నికల టైమ్ లోనే కుల సంఘాలు గుర్తుకు వస్తాయని, నాగార్జున సాగర్ ఎన్నికలు వస్తున్నందున యాదవులు, గిరిజనులు గుర్తుకు వచ్చార‌ని విమ‌ర్శించారు సంజ‌య్.

కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అనేది డ్రామానే అని, ఎవరు ముఖ్యమంత్రి అయిన చేసిందేం లేదని అన్నారు. పవిత్రమైన సీఎం పదవిని కాలి గోటితో సమానమనే కేసీఆర్… ముఖ్యమంత్రి పదవి కోసం ఎందుకు సాగిలపడుతున్నాడో చెప్పాలన్నారు. పేదలకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా పేదలను దగా చేస్తున్నాడన్నారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తుంటే అమలు చేయలేని స్థితిలో కేసీఆర్ ఉన్నాడని సంజ‌య్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, బీసీ మోర్చా నేతలు, వివిధ కుల సంఘాల లీడర్లు , నేతలు పాల్గొన్నారు.