తెలంగాణలో బీఆర్ఎస్‌‌ను బొందపెట్టాలి

తెలంగాణలో బీఆర్ఎస్‌‌ను బొందపెట్టాలి
  •     తెలంగాణలో ..బీఆర్ఎస్‌‌ను బొందపెట్టాలి
  •     ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలించే వరకు పోరాటం చేస్తాం: బండి సంజయ్‌‌
  •     రాముడి విగ్రహ ప్రతిష్టాపనను ఎంఐఎం రాజకీయం చేయాలని చేస్తోందని ఫైర్‌‌‌‌
  •     బోయినపల్లిలో అయోధ్య గుడి ద్వారాల తయారీ పనులను పరిశీలించిన సంజయ్

హైదరాబాద్/కరీంనగర్ సిటీ, వెలుగు :  తెలంగాణలో బీఆర్ఎస్‌‌ పార్టీని బొందపెట్టడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మూర్ఖపు పాలన పీడ విరగడైందన్నారు. అయినా రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ వేర్లు ఉన్నాయని, వాటిని కూకటివేళ్లతో పెకిలించే వరకు బీజేపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోను సంజయ్ సందర్శించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ద్వారాలు, కిటికీలు, ఇతర కలప వస్తువుల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా డిపో యజమానులు శరత్, కిరణ్‌‌ను సన్మానించారు. ఆపై మీడియాతో మాట్లాడారు. ‘‘మా టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్. బీఆర్ఎస్‌‌ను ఊపిరాడనీయకుండా చేస్తాం. కానీ కాంగ్రెస్‌‌కు బీజేపీ టార్గెట్. అందుకే బీజేపీని ఆ పార్టీ లక్ష్యంగా చేసుకుంది” అని అన్నారు. 

రామమందిర ప్రతిష్టను భగ్నం చేసే కుట్ర.. 

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం బీజేపీ ప్రోగ్రామ్‌‌ కాదని సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌తో పాటు దేవుడిని నమ్మని కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి రాముడి అక్షింతలను బుధవారం కరీంనగర్‌‌‌‌లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టను వివాదం చేసి, రాజకీయ లబ్ధి పొందాలని ఎంఐఎం చీఫ్‌‌ అసదుద్దీన్ ఒవైసీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు సైతం రామ మందిర నిర్మాణంపై సుప్రీంతీర్పును వ్యతిరేకించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం మసీదులను లాక్కోవచ్చంటూ ఒవైసీ వ్యాఖ్యలను ఖండించారు.

బీజేపీ కిసాన్ మోర్చా ఇన్​చార్జ్ గా బండి సంజయ్

సంస్థాగతమైన 7 జాతీయ స్థాయి విభాగాలకు బీజేపీ కొత్త ఇన్​చార్జ్​లను నియమించింది. ఇందులో  నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ కు ముఖ్యమైన కిసాన్ మోర్చా బాధ్యతలు కట్టబెట్టింది. అలాగే, తెలంగాణ ఇన్​చార్జ్ లుగా ఉన్న తరుణ్ చుగ్, సంస్థాగత ఇన్ చార్జ్ సునీల్ బన్సల్​కు ప్రయారిటీ కల్పించింది. బుధవారం నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు. యువ మోర్చాకు సునీల్ బన్సల్, ఎస్టీ మోర్చాకు డా. రాధామోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చాకు వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చాకు దుష్యంత్ కుమార్ గౌతమ్, మహిళా మోర్చాకు బైజయంత్ జయ్ పాండేను ఇన్ చార్జ్​లుగా నియమించారు.

అదృష్టం కలిసొచ్చి అధికారంలోకి వచ్చిన్రు..

తాము అధికారంలోకి వచ్చామనే నిజం నుంచి కాంగ్రెస్‌‌ నేతలు ఇంకా తేరుకోలేకపోతున్నారని, గిచ్చి చూసుకుంటున్నారని సంజయ్‌‌ ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులు వాడుతున్న భాషను చూస్తుంటే.. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తొస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ బినామీ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

 ‘‘ఎవరికి ఎవరు కోవర్టో.. ఏ పార్టీ నేతలు.. ఇతర పార్టీ నేతలతో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ నేతలకు అదృష్టం కలిసొచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప.. ఆ పార్టీ నేతలు చేసిన పోరాటాలేమీ లేవు’’అని సంజయ్‌‌ అన్నారు. తాను పార్టీ కార్యకర్తనని, హైకమాండ్‌‌ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు.