- అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు
- మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేసి తీరుతాం
- ఇంకో 4 నెలలే గడువు ఉంది
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు: మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ‘‘వచ్చే మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేసి తీరుతాం. మావోయిస్టులు లొంగిపోయేందుకు మరో 4 నెలలు మాత్రమే గడువు ఉంది. అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు” అని సూచించారు. ‘‘మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సలైట్లే కారణం. అర్బన్‌నక్సల్స్ బయట పైరవీలు చేసుకుంటూ ఆస్తులు సంపాదించుకొని కుటుంబ సభ్యులతో జల్సా చేస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మిన అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిండీ తిప్పలు లేక ప్రాణాలు కోల్పోతున్నారు’’ అని అన్నారు. మావోయిస్టులు మంచి ఆలోచనతో సమాజంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ పర్యటించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్లలో టౌన్‌లో నిర్వహించిన ‘యూనిటీ మార్చ్.. నషాముక్త్ భారత్’ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదన్నారు. ‘‘నక్సలైట్లు తుపాకులు పట్టుకుని అమాయకులైన దళిత, గిరిజనులను చంపుతున్నారు.
వేములవాడ బీజేపీ లీడర్ ప్రతాప రామకృష్ణను కూడా చంపేందుకు ప్రయత్నించారు. ఆయన చావుదాకా వెళ్లొచ్చారు. జాతీయ జెండా ఎగరేశారనే కారణంతో ఎంతోమంది బీజేపీ నేతలను కాల్చి చంపారు. జాతీయ జెండా ఎగరేసేటోడు భారతీయుడా? నల్లజెండా ఎగరేసేటోడు భారతీయుడా? నక్సలైట్లది ఏ సిద్ధాంతం? తుపాకీ ద్వారా మీరు సాధించిందేమిటి? మీరు సాధించిందల్లా అమాయకులను పొట్టన పెట్టుకోవడం.. మీరూ బలైపోవడం” అని మావోయిస్టులను ఉద్దేశించి అన్నారు.
ఇక తుపాకులు వదిలిపెట్టండి..
వచ్చే ఏడాది మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు. ‘‘మేం బ్యాలెట్‌ను నమ్ముకుని మూడోసారి అధికారంలోకి రాగలిగాం. మీరు (మావోయిస్టులు) తుపాకీ పట్టుకుని పోలీసులను, దళిత, గిరిజనులను చంపుకుంటూ పోయారు. మీరూ చనిపోవడం మినహా సాధించిందేమిటి? దేశ సరిహద్దులో జవాన్ల వద్ద, పోలీసుల వద్ద మాత్రమే తుపాకీ ఉండాలి. మావోయిస్టులు తుపాకులను వదిలి జన జీవన స్రవంతిలో కలవాలి. మావోయిస్టులు లొంగిపోవాలని అమిత్ షా అవకాశమిచ్చినా వినకుండా వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు.
కలం పట్టి చదువుకునే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు ఇచ్చి అడవుల్లోకి పంపితే... తిండీ తిప్పలు లేక వాళ్లు తిరుగుతున్నారు.. చనిపోతున్నారు. ఎవరైనా లొంగిపోతే వాళ్లపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇకపై తుపాకీ పట్టుకుంటే క్షమించేది లేదు” అని హెచ్చరించారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా దేశంలోని అన్ని ఆసుపత్రులకు నిధులు కేటాయిస్తున్నట్టు బండి సంజయ్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
