
ఇవాళ్టి నుంచి ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా పది రోజులపాటు బైక్ లతో గ్రామాలను చుట్టేయనున్నారు బీజేపీ నేతలు. ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా సిద్దిపేట లోని నాంచార్ పల్లి గ్రామంలో బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో బండి సంజయ్, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జి మురళీధర్ రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ అనంతరం బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి నుండి ఆయన వేములవాడ బయలుదేరనున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని ఫాజుల్ నగర్ లో బైక్ ర్యాలీని బండి సంజయ్ ప్రారంభించనున్నారు.
ప్రజా గోస- బీజేపీ భరోసా యాత్రలో మొదటగా సెలెక్ట్ చేసిన 6 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు కమలం నేతలు. తాండురు నియోజకవర్గానికి డీకే అరుణ, బోధన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్, జుక్కల్ కు వివేక్ వెంకటస్వామి, వేములవాడకు యెండల లక్ష్మీనారాయణ, సిద్దిపేటకు పీ మురళీధర్ రావు, నర్సంపేటకు రఘునందన్ రావును నియమించారు. పదిరోజుల పాటు బైక్ లపై గ్రామాల్లో పర్యటించి వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు బీజేపీ నేతలు.