బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ప్రస్థానం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ప్రస్థానం

రాష్ట్రంలో మరో  నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.   రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ ను తొలిగించి ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో పార్టీకి బండి సంజయ్ చేసిన సేవలను కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు.  

ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్న సంజయ్ ..  క్రమశిక్షణ కలిగిన కార్యకర్త నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎదిగారు.   హిందుత్వ ఎజెండానే నమ్ముకొని బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో సేవకుడిగా పనిచేశారు. విద్యార్థి దశలోనే స్వయం సేవక్‌ శిక్షక్‌గా ఎదిగాడు. కాలేజీ విద్యార్థిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ)లో చేరిన ఆయన పట్టణ కన్వీనర్‌గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 

బీజేపీ జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్‌చార్జిగా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధానకార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా, జాతీయ కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. కరీంనగర్‌లో వరుసగా రెండు సార్లు బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. కేరళ, తమిళనాడు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఎక్కడా కూడా దైర్యం కోల్పోలేదు.  

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి..  బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై 90 వేల భారీ మోజార్టీతో విజయం సాధించారు సంజయ్. ఈ గెలుపు బీజేపీకి మాంచి జోష్ తెచ్చిపెట్టింది.  యూత్ లో సంజయ్ పాపులారిటీ, పార్టీకి ఆయన చేసిన  సేవలను గుర్తించిన అధిష్టానం 2020 మార్చి 11న  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.  బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడయ్యాక  తెలంగాణ బీజేపీలో ఫుల్ జోష్ వచ్చింది.

 అధికార బీఆర్ఎస్  పార్టీకి నిద్రలేకుండా చేయడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు.  సంజయ్ బాధ్యతలు తీసుకున్నాక వచ్చిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచి సత్తా చాటింది.  ఆ  వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరువాత అత్యధిక స్థానాలను గెలుచుకుని బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నయంగా మారింది.   ఆ తరువాత జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. దీంతో  బండి సంజయ్ పేరు మారుమ్రోగింది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు గట్టి పోటీనే ఇచ్చింది.  

ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు సంజయ్. యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా  ప్రభుత్వానికి ధీటుగా వెళ్లారు. కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్లారు. అయినప్పటికీ సంజయ్ ఎక్కాడా కూడా భయపడలేదు . సంజయ్ కు ముందున్న బీజేపీకి ఆ తరువాత బీజేపీకి చాలా తేడా ఉందని చెప్పాలి. సంజయ్ అధ్యక్షుడు కాకముందు రాష్ట్రంలో ఒక్క సీటుతో ఉన్న బీజేపీ ఇప్పుడు మూడు సీట్లతో ఉండి 103 సీట్లున్న బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 

సంజయ్ సేవలను గుర్తించిన అధిష్టానం ఆయన సేవలను కేంద్రంలో వినియోగించుకోనుంది. సంజయ్  స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది.