
ముషీరాబాద్, వెలుగు : దేశ ఆర్థికాభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కీలకమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నారైలు విదేశాల్లో ఉంటున్నప్పటికీ మన దేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం రాత్రి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని మారియట్ హోటల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఎన్నారై మీట్ కార్యక్రమం జరిగింది.
బండి సంజయ్‌తో పాటు ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, యశస్విని రెడ్డి, కాటేపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన ఎంతో మంది వివిధ దేశాల్లో స్థిరపడ్డారన్నారు. ఆర్థికంగా సంపాదించి దేశంలో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు.