సంజయ్​కి బెయిల్.. కరీంనగర్​ జైలు నుంచి ఇవాళ విడుదల

సంజయ్​కి బెయిల్.. కరీంనగర్​ జైలు నుంచి ఇవాళ విడుదల

హనుమకొండ/ వరంగల్, వెలుగు:  బీజేపీ స్టేట్  చీఫ్​, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​కి హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్, పోలీస్ కస్టడీ పిటిషన్లపై గురువారం దాదాపు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిగింది. మధ్యాహ్నం రెండున్నరకు వాదనలు ప్రారంభం కాగా.. కోర్టులోని 18 మంది పీపీల్లో 13 మంది పోలీసుల తరఫున వాదించారు. వాదోపవాదాల అనంతరం రాత్రి 10 గంటల ప్రాంతంలో షరతులతో కూడిన బెయిల్​ను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత మంజూరు చేశారు. దీంతో  పొద్దంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. టెన్త్​ హిందీ క్వశ్చన్ పేపర్ లీక్  కేసులో సంజయ్​తో పాటు బూరం ప్రశాంత్,  గుండెబోయిన మహేశ్​ను కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.


టెన్త్​ హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్, ఏ2గా బూరం ప్రశాంత్, ఏ3గా గుండెబోయిన మహేశ్ సహా 9 మందిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి సంజయ్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు.. బుధవారం సాయంత్రం హనుమకొండ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్​ విధించారు. బుధవారం రాత్రి కరీంనగర్ జైలుకు తరలించారు. సంజయ్​కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు లీగల్ టీమ్ పిటిషన్ దాఖలు చేయగా.. పోలీసులు కౌంటర్ ఫైల్ చేశారు. సంజయ్,  ప్రశాంత్, మహేశ్​ను 3 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ రాపోలు అనిత  విచారణ చేపట్టారు. సంజయ్ బెయిల్ పిటిషన్​పై వాదనలు జరిగాయి. ఆయన తరఫున లాయర్లు విద్యాసాగర్ రెడ్డి, చొల్లేటి రామకృష్ణ, శ్యాం సుందర్ రెడ్డి కుట్ర కోణం ఆరోపణలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టెన్త్​ హిందీ పేపర్ ఫొటో తీసి వాట్సప్​లో షేర్ చేసిన వ్యక్తితో సంజయ్​కు సంబంధం లేదని, అలాంటప్పుడు కుట్ర కోణం ఎలా ఉంటుందన్నారు. కరీంనగర్​లో నమోదైన కేసులో సంజయ్​ని ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నారని, ఆ కస్టడీ నుంచి రిలీజ్ చేయకుండానే మరో కేసులో అరెస్ట్ చేశారని తెలిపారు. ‘‘ఎంపీగా ఉన్న సంజయ్ అరెస్టులో పోలీసులు 41 సీఆర్పీసీ నిబంధనలను ఉల్లంఘించారు. ఎవరి నుంచి పేపర్లు లీక్ అయ్యాయో సాక్ష్యాలు కోర్టుకు సమర్పించలేదు. సంజయ్ అరెస్ట్, పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి” అని కోరారు. ఈ నెల 8న ప్రధాని తెలంగాణకు రానున్నారని, బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్​ని మోడీ టూర్​కు దూరం చేయాలనే ఈ కేసులో ఇరికించారన్నారు. ‘‘ఇటీవల సంజయ్ అత్తమ్మ మరణించారు.. శుక్రవారం ఆమె దశదిన కర్మకు సంజయ్​ హాజరుకావాల్సి ఉంది. బెయిల్ మంజూరు చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.

సీపీ మాటలు భిన్నంగా ఉన్నయ్

టెన్త్​ క్లాస్​ క్వశ్చన్ పేపర్ లీకేజీ, సంజయ్ అరెస్ట్ విషయంలో వరంగల్ సీపీ రంగనాథ్ మాటలు భిన్నంగా ఉన్నాయని సంజయ్ తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఎగ్జామ్ పేపర్ వాట్సప్​లో వైరలైన 4వ తేదీన వరంగల్ సీపీ మీడియా సమావేశంలో చెప్పిన మాటలకు, సంజయ్ అరెస్ట్ కు సంబంధించిన 5వ తేదీ నిర్వహించిన సమావేశంలో చెప్పిన మాటలకు పొంతన లేదన్నారు. ‘‘ఈ నెల 4న ప్రెస్​మీట్​లో టెన్త్​ పేపర్ అంశం లీకేజీ కాదని చెప్పారు. ప్రశ్నపత్రం ఫొటో తీసిన వ్యక్తిని విచారించామని, పేపర్ బయటకు రావడంలో కుట్రలేదని సీపీ వెల్లడించారు. 5న జరిగిన ప్రెస్​మీట్​లో మాట మార్చారు. మొదటి రోజు కుట్ర కోణం లేదని చెప్పి, మరుసటిరోజు మాత్రం సంజయ్​పై కుట్ర కోణం ఆరోపణలు చేశారు” అని తెలిపారు. ఈ మేరకు  సీపీ రంగనాథ్ ఆ రెండు తేదీల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లలో మాట్లాడిన వీడియోలను ప్లే చేసి జడ్జికి చూపించారు. అంతేగాకుండా అకారణంగా నిర్బంధించి పోలీస్ వాహనాల్లో వివిధ ప్రాంతాల్లో తిప్పారని, సంజయ్​ని మానసికంగా, శారీరకంగా వేధించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సంజయ్ ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని తెలిపారు. 

లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తయ్: 

పోలీసులుసంజయ్​ని కస్టడీకి అప్పగించడంతో పాటు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని పోలీసుల తరఫున పీపీ రేవతి వాదించారు. సంజయ్​కి బెయిల్ ఇస్తే మళ్లీ మాల్ ప్రాక్టీసింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. టెన్త్​ క్లాస్​ పిల్లల తల్లిదండ్రులు ఆయనపై దాడులు చేసే అవకాశం ఉందని, దాంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ కేసులో కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని, సంజయ్ బయటకు వస్తే వారిని ప్రభావితం చేసే చాన్స్ ఉందని తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చన్నారు. సంజయ్​కు బెయిల్ ఇవ్వకుండా, 3 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేయాలని పీపీ కోరారు. 

ఇయ్యాల విడుదల

మధ్యాహ్నం 2.30కు కోర్టులో వాదనలు ప్రారంభం కాగా.. రాత్రి వరకు సుదీర్ఘంగా సాగాయి.  ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తీర్పును  పలుమార్లు వాయిదా వేశారు. రాత్రి 8 దాటినా తీర్పు రాకపోవడంతో సంజయ్ తరఫు లాయర్లు తాము వేసిన బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని (నాట్ ప్రెస్), ఆ పిటిషన్​ను డిస్మిస్ చేయాలని కోరారు. అనంతరం కొద్దిసేపటికి సంజయ్ కస్టడీ పిటిషన్ ను జడ్జి సోమవారానికి వాయిదా వేశారు. తర్వాత మరోసారి బెయిల్ పిటిషన్​పై ఇరువర్గాల వాదనలు జరిగాయి. రాత్రి 9.30 దాటినా ఉత్కంఠకు తెరపడలేదు. ఏడున్నర గంటలపాటు జరిగిన విచారణ తర్వాత రాత్రి 10 గంటలకు సంజయ్​కు షరతులతో బెయిల్ మంజూరైంది.  రూ.20 వేల పూచికత్తు సమర్పించాలని, విచారణకు సహకరించాలని, దేశం విడిచిపోవద్దని కోర్టు ఆదేశించింది. బెయిల్​ మంజూరు కావడంతో బీజేపీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. కాగా,  కరీంనగర్​ జైల్లో ఉన్న సంజయ్ ​శుక్రవారం విడుదల కానున్నారు.