కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ముఖ్యమంత్రి కావాలా?.. బీసీ సీఎం కావాలా?: బండి సంజయ్

కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ముఖ్యమంత్రి కావాలా?.. బీసీ సీఎం కావాలా?: బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.. బీసీని ముఖ్యమంత్రి చేద్దాం.బీజేపీకి ఓటు వేయండని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు.కేసీఆర్, రేవంత్  రెడ్డిలు ముఖ్యమంత్రి కావాలా.. బీసీ సీఎం కావాలా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు గెలిస్తే ఉప ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. కెసిఆర్ గెలిస్తే ఉప ఎన్నికలు వస్తాయని.. కేసీఆర్ కుటుంబంలో సీఎం కుర్చీ కోసం కొట్లాటలు జరుగుతాయని చెప్పారు. ప్రతి మండలంలో ముగ్గురు సమాంత రాజులు పరిపాలిస్తున్నారని..కొంత మంది పోలీసులు కేటీఆర్ మాట విని బిజెపి కార్యకర్తలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 10వ తేదీ శుక్రవారం.. సిరిసిల్ల పట్టణంలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు.

కేటీఆర్ దగ్గర రూ.120 కోట్లు ఉన్నాయంటే నమ్ముతారా.. సిరిసిల్లలోనే  రూ.10 వేల కోట్ల ప్రజల సంపదను దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ కు ఎదురు నిలబడిన సిరిసిల్ల బీజేపీ కార్యకర్తలను మెచ్చుకుంటున్నానన్నారు. నిరోద్యోగుల ఉద్యోగాల కోసం కొట్లాడిన తన మీద 10వ తరగతి పేపర్ లీక్ కేసు పెట్టారని..  ఐదు రోజులు పలు పోలిస్ స్టేషన్లు తిప్పి  కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్ పేపర్ లీక్ చేస్తే 50 లక్షల మంది రోడ్డున పడ్డారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం  కొంటుంటే.. ఈ పాస్ పోర్ట్ దొంగ కేసీఆర్.. మేము కొంటున్నామని ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు సిరిసిల్లలో ఏం చేశారో చెప్పి  శ్వేత పత్రం విడుదల చేస్తావా? కేటీఆర్ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే కేటీఆర్ ను కుక్క కూడా దేకదని ఎద్దేవా చేశారు.

పోలీస్ బందోబస్తు లేకుండా ఒక గంట సిరిసిల్లలో తిరిగే దమ్ము  కేటీఆర్ కు లేదన్నారు. బీఆర్ఎస్ కు బీసీ, దళిత ముఖ్యమంత్రి చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు బండి సంజయ్.
బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మేము ప్రకటించామన్నారు. కేటీఆర్ మీద రాణి బీజేపీ అభ్యర్థిగా రుద్రమ పోటీ చేస్తోందని.. ఆమె పేరు చెపితేనే కేటీఆర్ గజ గజ వణుకుతున్నారని అన్నారు.
కేటీఆర్ ను గద్దె దించాలని బీజేపీ అధిష్టానం రాణి రుద్రమను పంపించిందన్నారు. ప్రజల గుండెల్లో కమలం పువ్వు వికసిస్తుందని..సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. కార్యకర్తల్లో జోష్ చూస్తుంటే.. రాణి రుద్రమ గెలుపు ఖాయంగా కనిపిస్తోందని బండి సంజయ్ అన్నారు.