
- ఆ పరిధిలో అధికార పార్టీ లీడర్ల ఫామ్ హౌస్ లు ఉన్నయ్: సంజయ్
ఆదిలాబాద్/నిర్మల్, వెలుగు: కేసీఆర్ సర్కార్ తెచ్చిన ధరణితో బీఆర్ఎస్ నాయకులు మాత్రమే లాభపడ్డారని, పేద రైతులు అష్టకష్టాలు పడ్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్అన్నారు. ఇప్పుడు తనకు అయినవాళ్ల కోసమే 111 జీవోను కూడా కేసీఆర్ రద్దు చేశారని ఆరోపించారు. ‘‘ఆ ఏరియాల్లో బీఆర్ఎస్ లీడర్లు ఇప్పటికే పేదల దగ్గర తక్కువకు భూములు కొనుగోలు చేసి ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇప్పుడు జీవో రద్దుతో బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే లబ్ధి జరుగుతుంది” అని చెప్పారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఎంపీ సోయం బాపురావు కొడుకు వివాహానికి సంజయ్ హాజరయ్యారు. నిర్మల్ లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ రెండు చోట్ల సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పేదల భూములు గుంజుకుంటోందని సంజయ్ మండిపడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ భవనాల పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో విలువైన భూములు గజానికి రూ.100 చొప్పున తీసుకున్నదని చెప్పారు. రాష్ట్రంలో వేల కోట్ల భూములు అమ్మితేగానీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఓవైపు పేదల భూములు గుంజుకుంటూ, మరోవైపు విలువైన భూములు అమ్ముతున్న ప్రభుత్వం.. తమ పార్టీకి మాత్రం కోట్లాది రూపాయల భూమి కేటాయించుకుంటోందని ఫైర్ అయ్యారు.
భూమి కాజేసేందుకే కేబినెట్ మీటింగ్..
రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలో వేల కోట్ల విలువ చేసే 11 ఎకరాలను అగ్గువకే తమ పార్టీకి కేటాయించుకుందని సంజయ్ మండిపడ్డారు. పేదల భూములు గుంజుకొని అమ్ముకుంటున్న సర్కార్.. తమ పార్టీకి మాత్రం విలువైన భూములను కేటాయించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రూ.వేల కోట్ల విలువైన భూమిని బీఆర్ఎస్ కు రూ.40 కోట్లకే ఎట్ల కేటాయిస్తారు? కోకాపేటలో గజం ధర రూ.1.10 లక్షలుగా నిర్ధారిస్తూ హెచ్ఎండీఏ భూముల వేలం ప్రకటనలో పేర్కొంది. కానీ ఇప్పుడదే ప్రాంతంలో బీఆర్ఎస్కు కేవలం రూ.7,500కే ఎట్లిస్తరు? ఆ భూమిని కాజేసేందుకే కేబినెట్ మీటింగ్ పెట్టారు” అని ఫైర్ అయ్యారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు చెప్పిన మంత్రులు.. ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాలు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, ఆ స్థలంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే దోచుకుందని, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా తామేం తక్కువ కాదంటూ పోటీ పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ కు పోటీగా బీఆర్ఎస్ కోకాపేట భూములు లూటీ చేస్తోందన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తయ్..
రాష్ట్ర కాంగ్రెస్ సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉందని, ఆయన కనుసన్నల్లోనే ఆ పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయని సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు డబ్బులు సమకూరుస్తున్నది కేసీఆరేనని ఆరోపించారు. బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు పంపిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు పాకెట్ మనీ కిందనే రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ ఒక్కటే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు” అని కామెంట్ చేశారు. కానీ ఎవరెన్ని చేసినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ లో విచారణ కొనసాగుతోందని, కవితకు ఇందులో సంబంధం ఉందని తేలితే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ స్కామ్ లో కవితకు సంబంధం లేకపోతే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘‘కర్నాటకలో జేడీఎస్ నేత కుమారస్వామిని కేసీఆర్ మోసగించారు. బీఆర్ఎస్ ఏర్పాటు సమయంలో కుమారస్వామిని వాడుకున్నారు. ఇప్పుడు కుమారస్వామి ఫోన్ కూడా ఎత్తడం లేదు. కర్నాటకలో మా పార్టీకి బలం తగ్గలేదు. అక్కడ ఎంఐఎం, కాంగ్రెస్, మరో పార్టీ ఒక్కటై ఎన్నికల్లో పోటీ చేయడం వల్లనే అనేక సీట్లలో స్వల్ప మెజార్టీతో మా పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు” అని చెప్పారు.