రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన సిట్‌పై నమ్మకం లేదు : బండి సంజయ్

రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన సిట్‌పై నమ్మకం లేదు : బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నందున సిట్ ముందు అటెండ్ కాలేకపోతున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తనకు నమ్మకం లేదని, దీనిపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ మేరకు సిట్‌కు సంజయ్ రాసిన లేఖను అధికారులకు బీజేపీ లీగల్ టీమ్ ఆదివారం అందజేసింది. సిట్ ఎదురుగా అటెండ్ అవటానికి తనకేం అభ్యంతరం లేదని, కానీ పార్లమెంట్ సెషన్ ఉన్నందున రాలేకపోతున్నానని లేఖలో సంజయ్ పేర్కొన్నారు. ‘‘టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. పేపర్ లీక్ లో ఇద్దరు మాత్రమే ఉన్నారని మంత్రి మీడియా సమావేశంలో చెప్పారు. పేపర్ లీక్ వ్యవహారాన్ని మొదటి రోజు నుంచీ చిన్న అంశంగా, కేవలం ఇద్దరు మాత్రమే చేసినట్లు బయటకు చూపించేందుకు కొంత మంది కలిసి ప్రయత్నిస్తున్నారు” అని ఆరోపించారు.

నాకు తెలిసిన సమాచారమే మీడియాకు చెప్పిన

లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో ఏండ్ల నుంచి లక్షల ఫీజులు కట్టి ప్రిపేర్ అయ్యారని, ఇప్పుడు పేపర్ లీక్‌తో వారంతా నిరాశా నిస్పృహలకు గురయ్యారని బండి సంజయ్ పేర్కొన్నారు. లీకేజీ అంశంపై మరింత లోతుగా విచారణ చేయాలని సిట్ చీఫ్ ను కోరారు. ‘‘గ్రూప్ 1లో ఒకే గ్రామానికి చెందిన ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారని నాకు తెలిసిన వాళ్లు కొంత మంది చెప్పారు. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించిన. ఈ అంశంపై విచారణ జరిపించాలి. నేను ఎంపీని, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ని. పేపర్ లీక్ విషయంలో ఎక్కువ మంది ఉన్నట్లు నిత్యం పలు వర్గాల నుంచి నాకు సమాచారం వస్తుంది” అని వివరించారు.

సిట్​ ముందుకు లీగల్​ టీమ్​

పేపర్ లీకేజీ కేసులో బీజేపీ లీగల్‌ టీమ్‌ ఆదివారం సిట్ విచారణకు హాజరైంది. బండి సంజయ్‌కి బదులు నలుగురు సభ్యుల లీగల్‌ టీమ్‌ సిట్ ఆఫీస్‌కి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ అధికారులను కలిసింది. పార్లమెంట్​ సమావేశాలు ఉన్నందున బండి సంజయ్ విచారణకు హాజరు కాలేదని తెలిపింది. సిట్ అధికారులు అడిగిన సమాచారానికి సంబంధించిన వివరాలను లీగల్ ఫార్మాట్‌లో అందించినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌‌ లీకేజీలపై తమకు అనేక విధాలుగా సమాచారం వస్తుంటుందని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు సిట్‌కి తెలపాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలిసింది.