తెలంగాణ నూతన సచివాలయం ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 6 గంటల తర్వాత సుదర్శన యాగం జరగనుంది. మధ్యాహ్నం 1 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య పూర్ణాహుతి జరుగుతుంది. ఈ సచివాలయ ప్రారంభానికి ప్రజాప్రతినిధులు , అధికారులు ఇలా దాదాపు 2500 మంది హాజరుకానున్నారు. అయితే తాను సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లబోనని బీజేపీ తెలంగాణ చీఫ్, ఎంపీ బండి సంజయ్ అన్నారు. అది సెక్రటేరియట్ లా కన్పించడం లేదని.. ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసం ఒక వర్గం వాళ్లను సంతృప్తి పరచడానికే కట్టినట్టుందన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సంస్క్రతికి అనుగుణంగా మార్పులు చేసిన తర్వాతే సచివాలయానికి వెళ్తానన్నారు బండి సంజయ్. నల్లపోచమ్మ ఆలయానికి రెండున్నర గుంటలు కేటాయిస్తే.. మసీదుకు 5 ఎకరాలు ఇస్తారా? తెలంగాణలోని హిందూ సమాజమంతా ఒక్కసారి ఆలోచించాలన్నారు. కేసీఆర్ పాలనలో హిందువులంతా బాంచన్ బతుకులు బతకాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ సచివాలయాన్ని కూలగొడ్తామని పలు సార్లు బండి సంజయ్ వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.