టీఆర్ఎస్ కు ఓటేస్తే అవినీతికి వేసినట్లే : బండి సంజయ్

టీఆర్ఎస్ కు ఓటేస్తే అవినీతికి వేసినట్లే : బండి సంజయ్

ఒకప్పుడు కారు ఈఎంఐ కట్టలేని కేసీఆర్ కు లక్షల కోట్లు ఎక్కడివి? 

వీ6 వెలుగు ఇంటర్వ్యూలో బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు : మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునే ఆపద్బాంధవుడు.. ప్రజలు దోచుకునే అరాచకుడికి మధ్య జరుగుతున్న పోరు అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రజలు టీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ అవినీతికి, అరాచక పాలనకు ఆమోదముద్ర వేసినట్లేనని అన్నారు. ‘‘టీఆర్ఎస్ కు ఓటేస్తే.. ‘‘రాష్ట్రాన్ని దోచుకున్నరు.. ఇగ దేశాన్ని దోచుకోవడానికి వెళ్లండి” అని చెప్పినట్లవుతుంది. టీఆర్ఎస్ ఇచ్చే మందు, పైసలు తీస్కోని ఓట్లేశారనే బద్నాం మూటగట్టుకోవద్దు. నేను మునుగోడు ఓటరునని గల్లా ఎగరేసుకుని తిరిగేలా తీర్పు ఇవ్వాలి” అని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖం చూసి ఓట్లేసే రోజులు పోయాయని.. మునుగోడులోనూ దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలే రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు  కారు ఫైనాన్స్ కూడా కట్టలేని కేసీఆర్.. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లకు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలనే తాము గుర్తు చేస్తున్నామని.. తాము అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే, వాళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వీ6 వెలుగుకు సంజయ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

టీఆర్ఎస్ అభ్యర్థిని గంప కింద కమ్మిన్రు.. 
ఉప ఎన్నిక రావడానికి సీఎం కేసీఆరే కారణం. అసెంబ్లీలో మునుగోడు సమస్యలపై రాజగోపాల్ రెడ్డి గొంతెత్తితే.. కేసీఆర్ గెటవుట్ అన్నారు. అందుకే రాజగోపాల్ రాజీనామా చేసిండు. మొత్తం అసెంబ్లీనే మునుగోడుకు వచ్చేలా చేసిండు. రాజగోపాల్ రాజీనామాతో గట్టుప్పల్ మండలం వచ్చింది. చౌటుప్పల్–- నారాయణపురం రోడ్డు వచ్చింది. ఆసరా పింఛన్లు ఇచ్చారు. గిరిజన బంధు ప్రకటించి గిరిజన రిజర్వేషన్లు పెంచారు. ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి వల్లే వచ్చాయని మునుగోడు ప్రజలు బలంగా నమ్ముతున్నారు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం ఉంది. ఆపదలో ఆదుకునే వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డిపై నమ్మకం ఉంది. రాజగోపాల్ రెడ్డి మావోడు అని ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని ఆ పార్టీ నాయకులే ప్రచారానికి రానివ్వడం లేదు. ఒకవేళ వచ్చినా మాట్లాడనివ్వడం లేదు. ఆయనను గంప కింద కమ్మిన్రు. అంటే వాళ్ల అభ్యర్థి గెలిచే కెపాసిటీ మీద వాళ్లకే నమ్మకం లేదు. 

అవన్నీ అబద్ధాలే... 
రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కాంట్రాక్టు కోసమే బీజేపీలోకి వచ్చారనేది అబద్ధం. అది టీఆర్ఎస్ ఆరోపణ మాత్రమే. ఒకవేళ నిజంగా టెండర్లలో అక్రమాలు జరిగితే  నష్టపోయిన వ్యక్తులు ఆరోపణలు చేయాలి కదా. కానీ టీఆర్ఎస్ మాత్రమే ఎందుకు చేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆధారాలుంటే ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు. గొర్రెల స్కీమ్ పైసలు కూడా నిలిపివేయించామని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడో ప్రకటించిన చేనేతబంధు ఇన్నాళ్లు ఎందుకివ్వలే. మూడేండ్ల క్రితమే డీడీలు తీసిన గొల్లకుర్మలకు ఇన్నేండ్లు గొర్రెలు, పైసలు ఎందుకియ్యలే. ఇన్ని రోజులు ఎవరు ఆపిన్రు. తీరా ఎన్నికల టైంలో అకౌంట్లలో పైసలు వేసి వెనక్కి తీసుకున్నరు. పైగా నేను లెటర్ రాస్తేనే ఆగినట్లు ప్రచారం చేస్తున్నరు. గతంలో హుజూరాబాద్ ఎన్నికలప్పుడు దళితబంధు, జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వరద సాయం విషయంలో ఇదే విధంగా బద్నాం చేసే ప్రయత్నం చేశారు. 

ఎమ్మెల్యేల స్థాయిని కేసీఆర్ దిగజార్చిండు.. 
2 లక్షల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను తీసుకొచ్చి 2 వేల మంది ఓటర్లకు దండం పెట్టించే స్థాయికి కేసీఆర్ దిగజార్చిండు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా లోలోపల కుమిలిపోతున్నరు. ఇన్నాళ్లు వాళ్లను కేసీఆర్ పట్టించుకోలేదు. రారా..పోరా.. వాడు.. వీడు అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఇప్పుడేమో వాళ్లను అన్నా..అన్నా అంటూ బతిమిలాడుతున్నరు. తీరా మునుగోడులో గెలిస్తే ఆ క్రెడిట్ ఎమ్మెల్యేలకు ఇవ్వరు. మళ్లీ ఆ బావబామ్మర్దులే తమ ఖాతాలో వేసుకుంటరు. బీజేపీ గెలిస్తేనే తమకు గౌరవం పెరుగుతుందని, తమకు కలిసే టైమిస్తారని ఎమ్మెల్యేలతో పాటు సెకండ్ లెవల్ క్యాడర్ అనుకుంటోంది. 

వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తం... 
మా పార్టీ దేశవ్యాప్తంగా బలంగా ఉంది. ఒకప్పుడు మాకు రెండు ఎంపీ స్థానాలు ఉన్నప్పుడు బీజేపీ ఎక్కడుందంటూ అవహేళన చేశారు. కానీ ఇప్పుడు దేశంలో 330 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాష్ట్రంలోనూ వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తాం. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలో బీజేపీ గెలవలేదు. ఆ తర్వాత ఆర్నెళ్లకే జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది. నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు గెలవకపోయినా ఎంపీలు గెలిచాం. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ గెలిచాం. హుజూరాబాద్ ప్రజల్లాగే మునుగోడు ప్రజలు పైసలకు అమ్ముడుపోరు.

టీఆర్ఎస్సోళ్లకు అహంకారం తలకెక్కింది... 
టీఆర్ఎస్ నాయకులకు అహంకారం తలకెక్కింది. వాడు, వీడు అని ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారు. సమాధి కట్టి సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారు. రాజకీయాల్లో గెలవడం, ఓడిపోవడం సాధారణమే. కానీ విమర్శలు, ప్రతి విమర్శలు సంస్కారవంతం గా ఉండాలి. మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ గెలిచినట్లుగా చెప్పుకుంటరు. కానీ రాజగోపాల్ గెలిస్తే మునుగోడు ప్రజలు, బీజేపీ గెలిచినట్లు.  కేంద్రంలో 27 మంది బీసీ మంత్రులు ఉన్నరు. బీసీల పార్టీగా బీజేపీని చూస్తున్నరు. కేసీఆర్ ఒక బీసీని సీఎం చేస్తరా? టీఆర్ఎస్ అధ్యక్షుడిని చేస్తరా? 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మునుగోడుకు ఇచ్చిన హామీలు ఏమైనయ్?
మేం ప్రచారంలో ప్రజా సమస్యల గురించే మాట్లాడుతున్నం. కేసీఆర్ 2018లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నం. డిండి ప్రాజెక్టుతో పాటు కిష్టారాయినిపల్లి, చర్లగూడెం రిజర్వాయర్లను ఏడాదిన్నరలో పూర్తి చేసి లక్షా 70 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. చేనేత కార్మికులకు నూలు, రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నరు. డిగ్రీ కాలేజీ, 100 బెడ్ల ఆస్పత్రి, రోడ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాలపై హామీ ఇచ్చారు. చౌటుప్పల్ నుంచే కేసీఆర్ నిరుద్యోగ భృతిని ప్రకటించారు. మరి ఇవన్నీ ఏమైనయ్. ఈ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పే మునుగోడుకు రావాలి. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే...  
మునుగోడులో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తున్నాయి. టీఆర్ఎస్ పైసలు పంపితేనే కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్​ను పెంచి బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటున్నడు. కానీ మునుగోడు ప్రజలు అంత అమాయకులు కాదు. ఎవరిని గెలిపించాలో వాళ్లకు తెలుసు. రాజగోపాల్ ఇన్నేండ్లలో తమను ఇబ్బంది పెట్టలేదని.. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే తమ ఇండ్లు, జాగలు ఉండవని జనం భయపడుతున్నరు.