రాష్ట్రాన్ని కేసీఆర్​ దోచుకుతింటున్నారు:బండి సంజయ్

రాష్ట్రాన్ని కేసీఆర్​ దోచుకుతింటున్నారు:బండి సంజయ్
  • తప్పు చేసిన కవిత కోసం ప్రజలెందుకు ధర్నా చేయాలి?: బండి సంజయ్​
  • నమ్మి అధికారం ఇస్తే జనానికి చిప్ప చేతికి ఇచ్చిండు
  • లిక్కర్, గ్రానైట్, క్యాసినో, డ్రగ్స్ దందాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ
  • కృష్ణా వాటాలో 299 టీఎంసీలకే సంతకం చేసిన నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని ఫైర్​

నిర్మల్, వెలుగు: నమ్మి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలకు కేసీఆర్​ చిప్ప చేతికిచ్చారని, ఆయన కుటుంబం లిక్కర్, గ్రానైట్, క్యాసినో, డ్రగ్స్ దందాల్లో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ను ఎవరూ కాపాడలేరని స్పష్టం చేశారు. ఉద్యమ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేక పార్టీలతో జతకట్టి రాష్ట్రాన్ని కేసీఆర్​ దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. ‘‘కేసీఆర్.. నీ బిడ్డ ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? ప్రజల సొమ్ముతో అక్రమ దందా చేసేటోళ్లను సీబీఐ,ఈడీ ప్రశ్నిస్తే తప్పెట్లా అయితది? నిజాయితీగా పనిచేసే వ్యాపారస్తులను ఎందుకు ప్రశ్నించడం లేదో తెలుసుకోవాలి. తప్పు చేసిన కవిత కోసం ప్రజలు ఎందుకు ధర్నా చేయాలి?” అని నిలదీశారు. ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్ లో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్​ మాట్లాడారు.

నిర్మల్ జిల్లాలో అల్లకల్లోల మంత్రి అవినీతి పైనా, అలాగే వేలాది ఎకరాల కబ్జా భూములపైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. ‘‘వేల కోట్లు దోచుకుంటున్న అనకొండ సీఎం కేసీఆర్.. వేల ఎకరాల భూములు ఆక్రమిస్తున్న పెద్ద తిమింగలం నిర్మల్​ జిల్లా అల్లకల్లోల మంత్రి” అని ఆయన ఆరోపించారు. అవినీతి అనకొండ కేసీఆర్ కుటుంబంతో పాటు అవినీతి తిమింగలం అల్లకల్లోల మంత్రిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు.‘‘సీఎం కేసీఆర్ మతిస్థిమితం కోల్పోతున్నడు. కృష్ణా జలాల వాటాలో 299 టీఎంసీలకే సంతకం చేసిన నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్” అని మండిపడ్డారు.  ఇక హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్​ అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో హిందువులను మోసం చేస్తే, నిర్మల్ కు వచ్చి భరతం పడతామని హెచ్చరించారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చర్యలు పక్కనపెట్టి శాంతినగర్ లో పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే నిర్మల్​లో బడాబాబుల అక్రమ విల్లాలను బుల్డోజర్లతో కూల్చివేస్తామన్నారు. అర్హులందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. రైతులందరికీ పంట నష్టపరిహారం అందిస్తామని, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని చెప్పారు.  లవ్ జిహాదీల పేరిట హిందూ అమ్మాయిలను వేధించే వారందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను 36 ముక్కలు చేయడంతో పాటు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన అఫ్తాబ్ విషయంలో లౌకిక శక్తులు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. నిర్మల్ లో స్వీపర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి లక్షల రూపాలు తీసుకున్నవాళ్లు జనవరి 10 లోగా ఆ డబ్బులు ను తిరిగి చెల్లించాలని, లేకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బండి సంజయ్​ హెచ్చరించారు.  ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పెద్దపల్లి ఇన్​చార్జ్​ రావుల రామనాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్​ చక్రవర్తి, నాయకులు డాక్టర్ మల్లికార్జున్​రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.