నిర్మల్, వెలుగు: అకాల వర్షాలు, వడగండ్లతో నిర్మల్ జిల్లాలో వేల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు. సోన్ మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్క జొన్న పంటను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. సోన్తోపాటు మండలంలోని కూచన్ పల్లి, బొప్పారం, న్యూ వెల్మల్ గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సోన్ మండలంలోనే వెయ్యి ఎకరాలపైనే పంట నష్టం వాటిల్లిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ నివేదికలు తెప్పించుకోవడం తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు కూడా నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. నష్టపోయిన ప్రతి రైతును వెంటనే ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. బీజేపీ జిల్లా నేత సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, సర్పంచ్ లు రాచకొండ సాగర్, నరేశ్, పలువురు నాయకులు, రైతులు ఉన్నారు.
