సంక్షేమం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తోంది : బండి సంజయ్ 

సంక్షేమం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తోంది : బండి సంజయ్ 

బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కాదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం ఒక్కటే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎవరు ఎవరితో కలిసి పని చేశారో చరిత్ర చూడండి అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కేసీఆర్ కు నిజాయితీ ఉంటే కాంగ్రెస్ నుంచి గెలిచిన భూపాలపల్లి ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయించాలని సవాల్ విసిరారు. బీజేపీ పేరు చెప్పి సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి విషయంలో కేంద్రంపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం..రాష్ట్ర ప్రభుత్వం వాటా 51శాతం అని చెప్పారు. 

సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీతో పోల్చుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గిందంటూ తమ పార్టీని పలుచన చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఇంటింటికి కార్యక్రమం ద్వారా తాము 35 లక్షల కుటుంబాలను కలిశామన్నారు. ఏ కుటుంబాన్ని కలిసినా మోడీ ప్రవేశపెట్టిన పథకాల గురించి గొప్పగా చెప్పారని వివరించారు. దేశంలో 12 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత మోడీదే అన్నారు. 80 కోట్ల మందికి కేంద్రం ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తోందన్నారు. అన్నింటికీ మోడీ డబ్బులు ఇస్తే.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సంక్షేమం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం కోసం 1400 మంది పేదలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ కారును ఫైనాన్స్ వాళ్లు లాక్కెళ్లారు. అలాంటి కేసీఆర్ కుటుంబం నేడు కోట్లు సంపాదించింది’’అని వ్యాఖ్యానించారు బండి సంజయ్.  

అంతకుముందు.. మహా సంపర్క్ అభియాన్ లో చెల్పూరు చౌరస్తా నుండి భూపాలపల్లి టౌన్ లోని అంగడి మైదానం వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ బండి సంజయ్, చందుపట్ల కీర్తిరెడ్డి పూలమాల వేసి, నివాళులర్పించారు.