
టీఆర్ఎస్ పార్టీ లో ఉన్నవాళ్లంతా దొంగలేనంటూ ఘాటు విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో ఆధికార పార్టీ నాయకులు ఎక్కడ చూసినా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. నర్సంపేట నడిబొడ్డున 25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్నారు.
గురువారం మహబూబాబాద్ జిల్లా గూడూరు లో సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ పేరుతో ముఖ్యమంత్రి ఫాం హౌజ్, ప్రగతి భవనానికే పరిమితమయ్యాడన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల రైతులను ఏ మంత్రి గానీ, ముఖ్యమంత్రి కానీ పరామర్శించలేదన్నారు.
రాష్ట్రం లో జరుగుతున్న పనుల అన్నింటి కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఆనాథగా మారిందని అన్నారు. ఫౌం హౌజ్,ప్రగతి భవనానికి దారులు బంద్ అయ్యాయని, ప్రజలు మొత్తం గవర్నర్ ఇంటి వైపు దారి పడుతున్నారని అన్నారు.
త్వరలోనే ముఖ్యమంత్రి అవినీతి బయట పెడతామని ,బీజేపీ ఆధ్వర్యంలో అందోళన చేపడుతామని సంజయ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ జెండా ఎగరబోతుందని అన్నారు.