ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?

ఇంటర్ ఫలితాలలో మార్కులు తక్కువొచ్చాయని ఆత్మహత్యలు చేసుకొని నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచించారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఇంటర్ ఫలితాలలో 51 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దాంతో మనస్థాపానికి గురై ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనపై బండి సంజయ్ స్పందించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

‘ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. తమ నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్‌ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. తమ చావుకు ప్రభుత్వం, కేటీఆర్ కారణమంటూ స్వయంగా విద్యార్ధి ట్వీట్ చేయడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలి. గతంలో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బలయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? విద్యార్థుల ఆత్మహత్యలు, పరీక్షల్లో ఫెయిలవడానికి ప్రభుత్వం బాధ్యత వహించి తీరాల్సిందే. విద్యార్థులందరికీ ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేయించాలి. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.     విద్యార్థులకు  బీజేపీ అండగా ఉంటుంది. అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకూ వెనుకాడబోం’ అని బండి సంజయ్ హెచ్చరించారు.

For More News..

భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలి

రెండు ముక్కలైన కారు.. ముగ్గురు బలి