కేజ్రీవాల్, మాన్ వచ్చింది లిక్కర్ లెక్కల కోసమే

కేజ్రీవాల్, మాన్ వచ్చింది లిక్కర్ లెక్కల కోసమే

నీతి ఆయోగ్ భేటీకి డుమ్మా కొట్టి.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రావడం సిగ్గుచేటు: సంజయ్
కేసీఆర్.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుడేంది?
ఆయన మళ్లీ వస్తే యువత సూసైడ్ నోట్ రాసుకున్నట్లే
ఖమ్మం నిరుద్యోగ మార్చ్​లో బీజేపీ స్టేట్ చీఫ్

ఖమ్మం/ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం వింతగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టి.. ఆప్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు రావడం సిగ్గు చేటని మండిపడ్డారు. లిక్కర్ దందాలో వాటాల లెక్కలు మాట్లాడుకునేందుకే వారంతా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిశారని విమర్శించారు. ఖమ్మంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌‌‌‌‌‌‌‌లో బండి సంజయ్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జడ్పీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మార్చ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. జడ్పీ సెంటర్​ నుంచి పాత బస్టాండ్ దాకా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరపాటున కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లీ అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని హెచ్చరించారు. కొలువులు కావాలంటే కమలం రావాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జంబో డీఎస్సీని ప్రకటించి 25 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు. 

కమ్యూనిస్టులకు సిగ్గులేదు

రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, బీజేపీ ఇమేజ్ తగ్గిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సంజయ్ కొట్టిపారేశారు. ‘‘అటు ఇటు కాని కాంగ్రెస్ మాకు ప్రత్యామ్నాయమా? 2018 ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో విశ్లేషించండి. డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్​ను లేపేందుకు ఇది కొందరు వేస్తున్న ఎత్తుగడ” అని అన్నారు. ‘‘ఖమ్మం.. బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులకు అడ్డానట. కమ్యూనిస్టులకు సిగ్గులేదు. సూది దబ్బణం పార్టీలు అని తిట్టిన కేసీఆర్​ మోచేతి నీళ్లు తాగుతున్నరు. మర్డర్ కేసు నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ పక్కన చేరిండు ఒకాయన. సీటు కోసం కేసీఆర్ కాళ్లు మొక్కుతున్నడు ఇంకొకాయన” అని ఫైర్​ అయ్యారు. “ఇయాల బారికేడ్లు పెట్టినా పోలీస్ వలయాన్ని చేధించుకుని వచ్చిన నిరుద్యోగులకు నా సెల్యూట్. బీఆర్ఎస్ నేతల్లారా, బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్! మీ దుకాణం 5 నెలలే. ఆ తర్వాత మీ ఖేల్ ఖతం దుకాణం బంద్” అని సంజయ్ హెచ్చరించారు. బీజేపీ తమిళనాడు సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 

ట్విట్టర్ టిల్లును అరెస్ట్ చేయాలి

‘‘కేసీఆర్ పాలనలో ఆయన కొడుకు, అల్లుడు మంత్రులయ్యారు. సంతోష్, కవితకు ఉద్యోగాలొచ్చాయి. తెలంగాణ రాకముందు కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది బిచ్చపు బతుకు. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాల్లేవు. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవు, ” అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. లక్షల మంది నిరుద్యోగుల ఆవేదనకు కారణమైన ట్విట్టర్ టిల్లును అరెస్ట్ చేయాలన్నారు. 

దేశ ఆర్ధిక వ్యవస్థకు సీఎలు బ్రాండ్ అంబాసిడర్లు

మాదాపూర్, వెలుగు: సీఏలు అకౌంట్లంట్లు మాత్రమే కాదని, దేశ ఆర్థిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్  అన్నారు. తమ క్లయింట్లతో సక్రమంగా పన్నులు కట్టిస్తుండడం వల్లే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతున్నదన్నారు. దేశ అభివృద్ధిలో సీఏల పాత్ర కీలకమన్నారు. ఇన్​స్టిట్యూట్  ఆఫ్  చార్టెడ్  అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) స్నాతకోత్సవం శనివారం మాదాపూర్​లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంజయ్  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఏ టఫ్  కోర్స్  అని, అలాంటి కోర్సులో పాసవడం అభినందించదగ్గ విషయమన్నారు. మోడీ ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక వృద్ధి పెరిగిందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి గతంలో పదో స్థానంలో ఉంటే.. ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందన్నారు. 2047 నాటికి దేశాన్ని నంబర్ వన్​గా చేసేందుకు మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు.