స్పీకర్, మండలి ఛైర్మన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నరు: బండి సంజయ్

స్పీకర్,  మండలి ఛైర్మన్  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నరు: బండి సంజయ్

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. రాజ్యాంగ పదవిలో ఉంటూ ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్ కు వెళ్లడం సిగ్గు చేటని మండిపడ్డారు.  రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగానూ వ్యవహరించకూడదన్నారు.  పెద్దన్న పాత్ర పోషించి  రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన స్పీకర్, మండలి ఛైర్మన్  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఖర్చు పెడుతున్న ప్రతీ పైసా కేసీఆర్ ఇచ్చినవేనన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్రలో ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ఇండియాలో ఎన్నికలు వస్తే పాకిస్తాన్ లో ప్రచారం చేస్తారని ఎద్దేవా చేశారు.  కేసీఆర్ ఎక్కడికెళ్లిన చేసేదేం లేదన్నారు.

మే 4న  ఢిల్లీలోని వసంత్ విహార్ లో కొత్తగా నిర్మించిన  బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీసును కేసీఆర్  ప్రారంభించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.