న్యూఢిల్లీ:
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. బుధవారం (నవంబర్ 05) రాత్రి అధికారిక నివాసంలో హర్మన్‌సేనకు ఆతిథ్యం ఇచ్చిన మోదీ.. ప్లేయర్లను సత్కరించి ఒక్కొక్కరితో ఆత్మీయంగా మాట్లాడారు. సుదీర్ఘ పోరాటం, కీలక ఓటముల తర్వాత జట్టు పుంజుకున్న తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు.
టోర్నీ మధ్యలో వరుసగా మూడు ఓటములు ఎదురైనప్పటికీ, ఏమాత్రం నిరుత్సాహపడకుండా జట్టు అద్భుతమైన మనోబలం, పట్టుదల, పోరాటాన్ని చూపెట్టిందని ప్రధాని కొనియాడారు. తొలి దశలో సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొని ఆ ఒత్తిడిని జయించి చరిత్ర సృష్టించిన తీరును ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2017 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన తర్వాత మోదీని కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా హర్మన్ ప్రస్తావించింది. ‘అప్పుడు ట్రోఫీ లేకుండా వచ్చాం.
ఇప్పుడు వరల్డ్ కప్‌తో రావడం గర్వంగా ఉంది. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలతో తరచుగా మిమ్మల్ని కలుస్తామని ఆశిస్తున్నాం’ అని చెప్పింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తి శర్మ ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉన్న జై శ్రీ రామ్ ప్రస్తావన, చేతిపై ఉన్న హనుమాన్ టాటూ గురించి ప్రధాని అడగ్గా... అవి తనకు బలాన్ని ఇస్తాయని ఆమె నవ్వుతూ బదులిచ్చింది. 2021లో ఇంగ్లండ్‌పై హర్లీన్ డియోల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ను, తాను అప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. తాజా ఫైనల్ విజయం తర్వాత హర్మన్‌ప్రీత్ బాల్‌ను జేబులో పెట్టుకున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించగా.. ఆ బాల్ తన వద్దకు రావడం తన అదృష్టమని హర్మన్ చెప్పింది.
అమన్‌జోత్ కౌర్ క్యాచ్‌ను గురించి ప్రధాని మాట్లాడుతూ ‘క్యాచ్ పడుతున్నప్పుడు నువ్వు బంతిని చూసి ఉండవచ్చు, కానీ క్యాచ్ పట్టిన తర్వాత కచ్చితంగా ట్రోఫీని చూసి ఉంటావు’ అని నవ్వులు పూయించారు. దేశంలోని యువత, ముఖ్యంగా బాలికలు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేలా వాళ్లలో స్ఫూర్తి నింపాలని ప్రధాని ప్లేయర్లకు పిలుపునిచ్చారు క్రీడలను ప్రోత్సహించేలా ఫిట్ ఇండియా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వరల్డ్ కప్‌ను మోదీ చేతుల్లో పెట్టి గ్రూప్ ఫొటో దిగిన ప్లేయర్లు తాము సంతకం చేసిన ‘నమో’ జెర్సీని ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీమ్ హెడ్ కోచ్ అమోల్ మజుందార్, బీసీసీఐ బాస్ మిథున్ మన్హాస్ కూడా పాల్గొన్నారు.
