ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. బుధవారం తెల్లవారు జామునుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇష్టదైవాలకు నైవేద్యం సమర్పించి అభిషేకాలు, అర్చనలతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రమిదలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ‘ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం’ అంటూ పలు ఆలయాల్లో మహిళా భక్తులు పాటలు పాడారు.
మహిళలు ఇండ్లల్లోని తులసి కోటకు పూజలు చేసి జ్యోతులు వెలిగించి హారతులిచ్చారు. పలు ఆలయాలు, ఇండ్లల్లో సత్యనారాయణస్వామి వ్రత పూజలు చేసి నిష్ఠగా చేపట్టిన ఉపవాస దీక్షలను విరమించారు. అనంతరం చిన్నాపెద్ద తేడా లేకుండా పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. – వెలుగు నెట్వర్క్
