తెలంగాణలో ‘నోటి గబ్బు మాటలు’! : కేంద్రమంత్రి బండి సంజయ్

తెలంగాణలో ‘నోటి గబ్బు మాటలు’! : కేంద్రమంత్రి బండి సంజయ్
  •     అభివృద్ధి ముచ్చటే లేదు..అంతా బూతుల పంచాయితే: కేంద్రమంత్రి బండి సంజయ్ 
  •     రేవంత్, కేసీఆర్.. దొందూ దొందేనని పైర్

హైదరాబాద్, వెలుగు: ‘‘తెలంగాణలో ప్రస్తుతం ‘నోటి గబ్బు మాటలు’ వినిపిస్తున్నాయి. అభివృద్ధి గురించి చర్చే లేదు. జవాబుదారీతనం అసలే లేదు. అధికారంలో ఉన్నోళ్లు, రాజకీయ ఉనికి కోసం పాకులాడేటోళ్లు.. పొద్దున లేస్తే బూతులు, మురికి మాటలే మాట్లాడుతున్నారు’’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్.. కేసీఆర్ అండ్ బీఆర్ఎస్.. పబ్లిక్ డిబేట్‌‌ను పక్కకు వదిలేసి బూతు భాషను ఎంచుకున్నారు. 

లీడర్లు ఎప్పుడైతే డెవలప్‌‌మెంట్ గురించి మాట్లాడటం బంద్ పెట్టి, ఒకరినొకరు తిట్టు కోవడం మొదలుపెడతారో.. పాలనలో చూపించుకోవడానికి వాళ్ల దగ్గర ఏమీ లేదని అర్థం’’ అని ఎద్దేవా చేశారు.  ‘‘భాష గురించి నీతులు చెప్పే ఈ పార్టీలే.. నేడు రాజ్యాంగబద్ధమైన వేదికల నుంచి పరమ చెత్త మాటలు మాట్లాడుతున్నాయి. 

తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది ఉద్యోగాలు, పెట్టుబడులు, రైతులకు సాయం, నగరాల్లో మెరుగైన మౌలిక వసతులు.. అంతే తప్ప రూలింగ్ పార్టీ, అపొజిషన్ పార్టీ మధ్య ఈ రోజువారీ తిట్ల పంచాయితీ కాదు’’ అని బండి సంజయ్ సూచించారు. తెలంగాణ ప్రజలు తమకు మంచి పాలన కావాలని ఓట్లు వేశారని.. కానీ, 2014 నుంచి ఈ రాష్ట్రం చూస్తున్నది కేవలం మురికి పాలిటిక్స్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.