అత్యాచార ఘటనలపై స్పందించరా..?

అత్యాచార ఘటనలపై స్పందించరా..?

రాష్ట్రంలో రోజుకో అత్యాచార ఘటన చోటు చేసుకుంటోంది. సరైన సాక్ష్యాలున్నా.. ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తోందని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రఘునందనరావుపై కేసు పెట్టడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. న్యాయం కోసం పోరాడుతోన్న ఎమ్మెల్యే రఘనందనరావు పై కేసులు పెట్టడం బాధాకరమని బండి సంజయ్ అన్నారు. అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా..  దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న శ్రద్ధ దోషులను అరెస్ట్ చేయడంపట్ల చూపితే న్యాయం జరిగేదని చెప్పారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే  ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. 

అత్యాచార ఘటనలకు సంబంధించి రోజుకో కొత్త కేసు వెలుగు చూడడం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమన్న బండి.. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకానితనమేనని విమర్శించారు. నేరాలను అరికట్టడంలో మేమే నెంబర్ 1 అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ గొంతు ఎందుకు మూగబోయింది. ఘటనలపై స్పందించరా..? అని అధికార పార్టీని నిలదీశారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్న ఆయన... దోషులను శిక్షించే వరకు బీజేపీ ఉద్యమిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.