‘వీ6, వెలుగు’తో బండి సంజయ్ స్పెషల్ ఇంటర్వ్యూ

‘వీ6, వెలుగు’తో బండి  సంజయ్ స్పెషల్ ఇంటర్వ్యూ

బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు సంజయ్

టీఆర్​ఎస్​ నియంతృత్వ పాలనపై పోరాటం చేస్తామని, దాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. కేసీఆర్​ పిట్టకథలు ఇంకా ఎన్నాళ్లూ సాగవని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే పదం ఉండదని, అందరం కలిసి సమష్టిగా పనిచేస్తామని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన ‘వీ6, వెలుగు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వ అవినీతి బయటపెడుతామని, రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరవేయడమే తమ ముందున్న సవాల్​ అని చెప్పారు. పార్టీలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా తాను వారి వెంట ఉంటానని భరోసా ఇచ్చారు.

వీ6, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితు లైన మీకు ముందుగా శుభాకాంక్షలు. సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగినందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు?

సంజయ్: రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. ముఖ్యంగా నన్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి, నా శక్తిని చాటిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా. పని చేయడం తప్ప పదవులు ఆశించే అలవాటు నాకే కాదు.. బీజేపీ సిద్ధాంతాలను ఊపిరిగా భావించే ఏ కార్యకర్తకూ ఉండదు. జాతీయ అధిష్టానం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వను. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుతా.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందున్న తొలి సవాల్ ఏమిటి? 

సామాన్య కార్యకర్తగానైనా, రాష్ట్ర అధ్యక్షుడిగానైనా నా ముందున్న ఒకే ఒక్క సవాల్.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడం, టీఆర్ఎస్ నియంతృత్వ పాలనను అణచి వేయడం, గులాబీ పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై పోరాడబోతున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్క దారి పట్టిస్తున్న తీరును ఎండగట్టబోతున్నాం. కేంద్ర నిధుల్ని పేర్లు మార్చి, ప్రకటనల ద్వారా రాష్ట్ర పథకాలుగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంది. రాష్ట్రంలో అవినీతిని బయటపెడతాం. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో ఇంటర్ స్టూడెంట్స్​ ఆత్మ హత్యలు, ఆర్టీసీ కార్మికుల బలిదానాలు జరిగాయి. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులు పెట్టారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

తమకు ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్సేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.. దీనిపై మీరెమంటారు?

టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం, బలమైన ప్రత్యర్థి బీజేపీనేనని రాష్ట్ర ప్రజలు విశ్వసించారు.. గమనించారు.. ఇప్పుడు గుర్తించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా పార్టీని రాష్ట్రంలో ముందుకు నడిపిస్తాం. పేద, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు, స్టూడెంట్స్​ తరఫున బలమైన పోరాటం చేస్తాం. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకుంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ క్షీణించింది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడే శక్తి కాంగ్రెస్ కు లేదు. టీఆర్ఎస్ కు బీజేపీ దమ్మేంటో చూపిస్తాం. బంగారు తెలంగాణ పేరుతో ప్రజల్ని తండ్రీకొడుకులు(కేసీఆర్, కేటీఆర్) మోసం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం నిస్వార్థంగా పోరాడిన నేతల్ని కేసీఆర్ పక్కన పెట్టారు. టీఆర్​ఎస్​ నేతల్లో అసంతృప్తి అలుముకొని ఉంది.  కేసీఆర్ పిట్ట కథలతో ఇంకా ఎంతో కాలం ప్రజల్ని మోసం చేయలేరు. టీఆర్​ఎస్​కు కాలం దగ్గరపడ్డది.

టీఆర్ఎస్, ఎంఐఎం రాజకీయాలపై మీ స్పందన? గ్రేటర్ పరిధిలో మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది?

రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎం అరాచకాలను సృష్టిస్తున్నాయి. భైంసా అల్లర్లు, సీఏఏ కు వ్యతిరేకంగా నిర్ణయాలు, స్టూడెంట్స్​పై  లాఠీ చార్జ్​ వంటి అంశాలను ప్రజలు గమనిస్తున్నారు.  రాబోయే జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురబోతుంది. టీఆర్ఎస్, ఎంఐఎం పాలనతో గ్రేటర్ వాసులు విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పాలకులకు బల్దియా ప్రజలు గట్టిగా బుద్ధిచెప్తారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజల సంక్షేమం, హక్కుల కోసం జైలుకు వెళ్లేందుకు, లాఠీ దెబ్బలను బరించేందుకు బీజేపీ కార్యకర్త సిద్దంగా ఉంటాడు.

కేడర్​కు, అభిమానులకు మీర్చే సందేశం?

రాష్ట్రంలో కమలం వికసిస్తుంది. కార్యకర్తలు, యువత మరింత ఉత్సాహంగా పని చేయండి. శ్రమించే కార్యకర్తకు పార్టీలో ఎప్పుడూ కీలక స్థానం ఉంటుంది. ఆ మాటకు నేనే నిదర్శనం.  టీఆర్ఎస్ అక్రమ కేసులకు భయపడొద్దు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా అండగా ఉంటా.

రాష్ట్రంలో బీజేపీ గెలిచిన 4 ఎంపీ సీట్లు  గాల్లో వచ్చినవే అనేది కేసీఆర్, కేటీఆర్ విమర్శలు. వీటిని మీరు ఎలా తీసుకుంటారు?  ప్రధానంగా గ్రామీణ స్థాయిలో బీజేపీకి బలం లేదన్న ప్రచారం ఉంది.. దీనిపై మీ స్పందన..!

 

బీజేపీ గాల్లో గెలిచింది అనే ముందు, వాళ్లు(టీఆర్​ఎస్​) ఏ గాలితో గెలిచారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ గాల్లో గెలిచిన నేతలే టీఆర్ఎస్ కు చావు దెబ్బ కొట్టారనే విషయాన్ని విస్మరించొద్దని కేసీఆర్, కేటీఆర్ లకు సూచిస్తున్న. నిజామాబాద్ లో సీఎం కూతురు, నాపై కరీంనగర్ లో టీఆర్ఎస్ పార్టీ కీలక నేత అని చెప్పుకునే వారే ఓటమి పాలైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గడిచిన ఎన్నికలు కాదు.. రాబోయే ఎన్నికల్లో ఎవరి గాలికి ఎంత శక్తి ఉందో ప్రజలు తేల్చబోతున్నారు. ఇందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కమలం పార్టీకి బలం లేదన్నది అవాస్తవం. స్థానిక, మున్సిపల్, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరుగుతూ వచ్చింది. లోక్​సభ ఎన్నికల్లో మా పార్టీకి గ్రామీణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం తనయుడు కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో మా పార్టీకే ప్రజలు జై కొట్టారు.

తెలంగాణలో బీజేపీ బండిని ఎట్ల లాగబోతున్నారు? పాత, కొత్త నేతల్ని ఎలా కలుపుకొని వెళ్లనున్నారు? పార్టీ బలోపేతానికి మీ ప్లాన్లు ఏమిటి?

పార్టీ బండిని లాగే సామర్థ్యం, శక్తి, యుక్తి ఉందన్న యోచనతోనే నాకు అధిష్టానం ఇంత పెద్ద బాధ్యత అప్పగించింది. బీజేపీలో సీనియర్లు, జూనియర్లు అనే పదాలు ఉండవు. ఎవరు ఏ పదవిలో ఉన్నా, ఏ బాధ్యతలు చేపట్టినా… పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే అందరి లక్ష్యం. జాతీయ స్థాయిలోనూ పార్టీలో ప్రధాని మోడీ, అమిత్ షా కన్నా సీనియర్లు ఉన్నారు. అట్లని మరొకరిని తగ్గించే ఆస్కారం ఇక్కడ ఉండదు. అవసరాల్ని బట్టి పార్టీ పదవుల్ని, బాధ్యతలను అప్పగిస్తుంది. ప్రణాళికల విషయానికి వస్తే, టీఆర్ఎస్ ను గద్దె దించడమే మా లక్ష్యం. ఇందుకోసం అందర్ని కలుపుకొని ముందుకు వెళ్తా. పార్టీ అంటేనే అందరి సమష్టి నిర్ణయం. జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, కోర్ కమిటీల సూచనల మేరకు ఉద్యమాలు, పోరాటాలను సిద్ధం చేసుకుంటాం.