మంత్రులను పంపియ్యకుంటే.. నేనే మునుగోడు వస్తా: బండి సంజయ్

మంత్రులను పంపియ్యకుంటే.. నేనే మునుగోడు వస్తా: బండి సంజయ్

మునుగోడులో చీరలు, డబ్బులు విచ్చలవిడిగా పంచి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టీఆర్ఎస్ పై బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తోందని అన్నారు. పోలీసులు, ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు. ప్రచార సమయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయించినా.. తాము సంయమనంతో ఉన్నామని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను మునుగోడు నుంచి పంపించకపోతే.. తాను వస్తానని అన్నారు. బీజేపీ కార్యకర్తలంతా మునుగోడుకు తరలిరావాలని పిలుపునిచ్చే పరిస్థితి రానివ్వొద్దన్నారు. ఒక్క ఉపఎన్నిక గెలవడానికి సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే దాడులు చేయిస్తున్నారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

అంతకుముందు.. ఎన్నికల ప్రచారానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడి మలక్ పేట్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న.. బీజేపీ కార్యకర్త ఎం.రమేశ్ యాదవ్ ను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా అతడికి అందుతున్న వైద్యం పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రమేశ్ యాదవ్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. బీజేపీ కార్యకర్తలను కాపాడుకోవడం తమ బాధ్యత అని ఆయన చెప్పారు. పూర్తిగా కోలుకునే వరకు రమేశ్ యాదవ్ కు తాము అండగా ఉంటామన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ప్రభాకర్ కూడా బండి సంజయ్ తో కలిసి రమేశ్ యాదవ్ ను పరామర్శించారు.