
పంచభూతాలను దేవుడుగా ఆరాధించే సంస్కృతి మన హిందూ సంప్రదాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 2005 నుండి 2011 వరకు హిందూ సాంప్రదాయాల కోసం కొట్లాడి ఏడు సార్లు జైలుకు వెళ్ళొచ్చానని గుర్తు చేశారు. హిందు ధర్మాన్ని , హిందూ దేవుళ్లను కించపరిచినప్పుడు హిందువు అనేవారు ఎవరైనా సరే ఎదురు తిరిగి సమాధానం చెప్పాలని సూచించారు. పటాన్ చెరువులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా 120 ఏళ్ల క్రితం వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి దర్శించుకున్నాని, అమ్మవారిని చూడగానే ఒళ్ళు పులకరించిందని చెప్పారు.
ఇటీవల అయ్యప్ప స్వామిని విమర్శించిన వాడి పరిస్థితి ఏమైందో.. ధర్మాన్ని కించపరిచినట్లు ఎవరు మాట్లాడిన వారికి అదే పరిస్థితి పడుతుందని బండి సంజయ్ తెలిపారు. 80 శాతం హిందువులు ఉన్న భారతదేశంలో రామ మందిరం నిర్మించడానికి ఎన్నో కొట్లాటలు జరిపామని అన్నారు. మూలాయం సింగ్ హయాంలో రామ మందిర నిర్మాణం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో తాను ఒక కర సేవకునిగా ఎన్నో దెబ్బలు తిన్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం రామ మందిరాన్ని ఎంతో సుందరంగా నిర్మించుకుంటున్నామని పేర్కొన్నారు. కాశి మహానగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మోడీదన్న బండి సంజయ్.. జన్మలో ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలన్నారు.