
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో పదుల సంఖ్యలో పోలీసులు ఇంట్లో వచ్చారని చెప్పారు సంజయ్ భార్య అపర్ణ. అరెస్ట్ వారెంట్ ఉందా అని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని.. లే.. లే అంటూ బలవంతంగా ఎత్తుకెళ్లారని చెబుతున్నారు అపర్ణ.
అతనికి అనారోగ్యంగా ఉందని.. ట్యాబ్లెట్లు కూడా ఇవ్వనివ్వలేదన్నారామె. బలవంతంగా ఎత్తుకెళుతున్న సమయంలో అడ్డుకున్న కార్యకర్తలను బూటుకాళ్లతో తన్నారని.. ఈడ్చుకెళ్లారని కన్నీటి పర్యంతం అయ్యారు బండి సంజయ్ భార్య అపర్ణ. మా తల్లి కర్మకాండలు ఉండటంతో.. కుటుంబ సభ్యులు 20 మంది ఇంట్లో చర్చించుకుంటున్న సమయంలో భారీ సంఖ్యలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నారామె. ఎక్కడికి తీసుకెళుతున్నారు.. ఎందుకు తీసుకెళుతున్నారు అనేది కూడా చెప్పలేదంటూ కన్నీటి పర్యంతం అయ్యారు అపర్ణ.
పోలీసులు లాక్కెళ్లిన సమయంలో కింద పడిన బండి సంజయ్ మూతికి దెబ్బతగిలిందని.. కనీసం నీళ్లు కూడా ఇవ్వనీయలేదన్నారామె. తీసుకెళుతున్న సమయంలో మమ్మల్ని ఇంట్లో పెట్టి తలుపులు మూసివేశారని.. బయటకు కూడా రానీయలేదన్నారామె. ఇంటికి వచ్చిన పోలీసులు అందరూ కరీంనగర్ కు చెందిన వాళ్లే అన్నారు. అల్లుడికి బాధ్యతలు నిర్వహించటానికి వచ్చిన బండి సంజయ్ ను.. ఇలాంటి సమయంలో అరెస్ట్ చేయటం ఏంటన్నారు. ప్రభుత్వం కుట్రలు చేస్తే భయపడే రకం కాదని.. అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్ భార్య అపర్ణ.