
"మిషన్ 90" టార్గెట్గా బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పక్కా వ్యూహాలతో ప్రజలతో మమేకమవుతోంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం, కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న అంశాలను వివరిస్తూ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ నెల 25 నుంచి నియోజకవర్గాల పర్యటనలకు సిద్ధమయ్యారు. పార్టీ జాతీయ స్థాయి నేతలతో ఒక్కో నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 25 నాటికి బీజేపీ చేపట్టిన 11వేల కార్నర్ మీటింగ్స్ పూర్తి కానున్నాయి. ఆ వెంటనే నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి బండి సంజయ్ ఇప్పటికే పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకున్నారు. నియోజకవర్గాల పర్యటన అనంతరం ఉమ్మడి 10 జిల్లాల్లో బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ పబ్లిక్ మీటింగ్ లకు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు జాతీయ నేతలు హాజరుకానున్నారు.