మీ ఫెయిల్యూర్స్​కు కేంద్రాన్నినిందిస్తారా?

మీ ఫెయిల్యూర్స్​కు కేంద్రాన్నినిందిస్తారా?
  • పోతిరెడ్డిపాడు సమస్యపై కేసీఆర్​ మొసలి కన్నీరు
  • ఏపీ టెండర్లు పూర్తయ్యేలా సహకరించి ఇప్పుడు ఆరోపణలా?
  • ఆస్కార్​ అవార్డు స్థాయిలో డ్రామాలు ఆడుతున్నరని ఎద్దేవా

 

హైదరాబాద్, వెలుగు:  పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటి దోపిడీపై సీఎం కేసీఆర్​ సరైన టైంలో స్పందించకుండా.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఏపీ టెండర్లు పూర్తయ్యేలా సహకరించారని, ఆస్కార్​ అవార్డు స్థాయిలో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్​ ఫెయిల్యూర్స్​ను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రాన్ని నిందించడం సరికాదని స్పష్టం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కేసీఆర్​ రాసిన లెటర్​లో అన్నీ అసత్యాలు, అభ్యంతరాలే ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ఈ మేరకు బండి సంజయ్​ ఆదివారం సీఎం కేసీఆర్ కు లెటర్​ రాశారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సవాల్​ చేశారు.

పోతిరెడ్డిపాడుపై లెటర్​ రాయలేదేం?

పోతిరెడ్డిపాడుపైగానీ, ఇతర ప్రాజెక్టుల సమస్యలపైగానీ సీఎం కేసీఆర్​ ఇప్పటివరకు కేంద్రానికి ఏ లేఖ రాయలేదనేది నిజం కాదా అని బండి సంజయ్​ ప్రశ్నించారు. కేంద్రానికి రాసిన రెండు లెటర్లు కూడా కృష్ణా నీళ్లలో భాగస్వామ్యంపై నిర్ణయం తీసుకునేలా ట్రిబ్యునల్ ను ఆదేశించడానికి సంబంధించినవేననీ స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ ఇప్పటికే వాదనలు వింటోందని, తీర్పు ఎప్పుడైనా ఇచ్చే అవకాశం ఉందని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్​ తన ఫెయిల్యూర్స్​ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఉద్దేశపూర్వకంగా కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.

ఏపీ మేలో జీవో ఇస్తే ఇప్పటిదాకా ఏం చేశారు?

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు ఆరు నుంచి ఎనిమిది టీఎంసీల నీళ్లు అదనంగా తీసుకునేలా సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ఏపీ మే నెలలోనే జీవో 203 ఇచ్చిందని బండి సంజయ్​  గుర్తుచేశారు. మరి ఇప్పటిదాకా సీఎం కేసీఆర్​ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆ ప్రాజెక్టులను ఆపాలంటూ తాను కేంద్రమంత్రికి లెటర్​ రాశానని, దానిపై కేంద్రం స్పందించి ప్రాజెక్టులపై ముందడుగు వేయొద్దని ఏపీకి సూచించిందని చెప్పారు. అయినా ఏపీ సర్కారు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్రం ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్​ ఏర్పాటు చేస్తే.. కేసీఆర్​ మాత్రం దానిని వాయిదా వేసేలా చేశారన్నారు. ఏపీ సీఎం జగన్​తో చేతులు కలపడంతోనే.. టెండర్లు సాఫీగా జరిగేలా కేసీఆర్​ సహకరించారని దీన్ని బట్టి అర్థమవుతోందని తెలిపారు. అప్పుడు టెండర్ల ప్రక్రియ జరిగేందుకు సహకరించి, ఇప్పుడు ఆ తప్పును కేంద్రంపై నెట్టివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇవన్నీ ఆస్కార్ అవార్డు స్థాయిలో ఆడుతున్న డ్రామాలని అందరికీ అర్థమవుతోందని స్పష్టం చేశారు. కేసీఆర్, జగన్​ ఇద్దరూ కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు సరిగ్గా అపెక్స్ మీటింగ్ కు రెండు రోజుల ముందు కేంద్రానికి లెటర్​ రాయడం ఏమిటని ప్రశ్నించారు.

తక్కువ నీళ్లకు ఎట్లా ఒప్పుకున్నరు?

తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వాడుకునేందుకు అంగీకరించారా లేదా సీఎం కేసీఆర్​ చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం 68.5 శాతం తెలంగాణలో ఉందని.. ఈ మేరకు రాష్ట్రానికి 555 టీఎంసీలు (మొత్తం 811 టీఎంసీల్లో 68.5% వాటా) రావాలని.. అయినా 299 టీఎంసీలకే అంగీకరించారని గుర్తు చేశారు. ఈ విషయంలో కేసీఆర్​ ఎందుకు ఫెయిలయ్యారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ఏకంగా 512 టీఎంసీల కంటే ఎక్కువగా తీసుకుంటుంటే.. తెలంగాణ ఆ 299 టీఎంసీల నీళ్లనూ వాడుకోలేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు న్యాయం జరిగిగేలా ఏపీకి తరలించుకుపోయే చోట టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించిందని.. కానీ నిధులివ్వకుండా టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయలేదని తప్పుపట్టారు.