టీఆర్​ఎస్​ అవినీతిపై  సంగ్రామం

V6 Velugu Posted on Aug 28, 2021

  • ప్రజల్లో భరోసా నింపడానికే నేటి నుంచి యాత్ర
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​
  • జనం సమస్యలు, ఇబ్బందులు యాత్రలో తెలుసుకుంటం
  • ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తం.. పట్టించుకోకుంటే మెడలు వంచైనా పరిష్కరింపజేస్తం
  • దేశంలో అత్యంత అవినీతి పరుడు కేసీఆరే.. ఆయన భరతం పడుతామని హెచ్చరిక


రాష్ట్రంలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు విరుద్ధంగా మూర్ఖపు పాలన కొనసాగుతున్నది. కుటుంబ, అరాచక, అవినీతి పాలన నడుస్తున్నది. జనాలు ఇబ్బందులు పడుతున్నరు. కష్టాల్లో ఉన్న ప్రజలకు బీజేపీ అండగా ఉందని చెప్పడానికి యాత్ర చేస్తున్న. ప్రజలు చెప్పిన సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తం. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుంటే ఆందోళన చేస్తం. కేంద్రం తెచ్చిన సంక్షేమ పథకాలను యాత్రలో ప్రజలకు వివరిస్తం. వారి ఆశీర్వాదం కోరుతం. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తది. ఇప్పుడు తెలుసుకునే సమస్యలు, ప్రజల అభిప్రాయాలను వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపరుస్తం.
హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రజల్లో భరోసా నింపడానికి, వారికి అండగా ఉండడానికే  ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నట్లు బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌, ఎంపీ బండి సంజయ్‌‌ తెలిపారు. జనం సమస్యలు, ఇబ్బందులను యాత్రలో తెలుసుకుంటామని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం పట్టించుకోకుంటే మెడలు వంచైనా పరిష్కరించేలా చూస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌‌  చేస్తున్న అవినీతిని ఎండగడతామని, కేసీఆర్ భ‌‌ర‌‌తం ప‌‌డ‌‌తామని హెచ్చరించారు. 

దేశంలో అత్యంత అవినీతిపరుడు కేసీఆర్​ అని ఆరోపించారు. ప్రజల మధ్యకు వస్తానని, ప్రజల మధ్య ఉంటానని, ప్రజా సమస్యలు తెలుసుకుని పోరాటం చేస్తానని బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన రోజే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా వల్ల పాదయాత్ర ఇన్ని రోజులు లేట్​ అయిందని, చార్మినార్‌‌‌‌  భాగ్యలక్ష్మి ఆలయం నుంచే పాదయాత్ర కొనసాగిస్తామని చెప్పారు. సంజయ్​ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన యాత్ర వివరాలను ‘వెలుగు’తో పంచుకున్నారు. 
రాష్ట్ర ప్రజలు హ్యాపీగా లేరని మీరంటున్నరు.. ఏ ఎన్నికైనా టీఆర్ఎస్‌‌‌‌ గెలుస్తోందని ఆ పార్టీ లీడర్లంటున్నరు కదా?
సీఎం కేసీఆర్​ ఎన్నికలొస్తనే బయటకు వస్తరు.. ఆయనొస్తే హామీలు బయటకు వస్తయ్​. సక్కగ పరిపాలిస్తే  జనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నరు? సాధారణంగా ఏ ఎన్నికల్లో గెలిచినా పార్టీలు సంబురాలు చేసుకుంటయ్​. కానీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ గెలిస్తే ఎక్కడ కూడా సెలబ్రేషన్స్‌‌‌‌ చేసుకోలేదు. రూ. 100 కోట్లు ఖర్చు చేసి గాయిగాయి అయిన్రు. ఒక్క ఎమ్మెల్సీకి రూ. 100 కోట్లు ఖర్చు చేసిన్రు. హుజూరాబాద్‌‌‌‌లో కూడా వేల కోట్లు ఖర్చు చేస్తున్నరు. పైసలు పెట్టి, అడ్డదారిలో, అక్రమ పద్ధతుల్లో గెలవాలని టీఆర్​ఎస్​ చూస్తున్నది. సెప్టెంబర్‌‌‌‌ 17  విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బీజేపీ అనేక ఏండ్లుగా పోరాడుతున్నది. ఇందుకోసం లాఠీల దెబ్బలు తిన్నం. జైలుకు కూడా పోయినం. రాష్ట్ర ఏర్పడ్డాక కనీసం విమోచన దినోత్సవం జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నం. అధికారికంగా జరపాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నం. 
కేంద్రం ఏమీ చేయలేదని టీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నరు.. మీరేమంటారు?
రేషన్‌‌‌‌ బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది.  కిలోకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయి మాత్రమే ఇస్తున్నది. దానికి లబ్ధిదారుడు రూపాయి కడ్తడు. రెండు రూపాయలకు బియ్యం ప్రపంచంలో ఎక్కడ దొరకవు. ఇందులో రూ. 29 కేంద్రం ఇస్తున్నది. దాన్ని ఈ మధ్య పెంచిన్రు. కరోనా నేపథ్యంలో దీపావళి వరకు ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. కేసీఆర్‌‌‌‌ ఇవ్వాల్సిన బియ్యం ఇస్తలేరు. రేషన్‌‌‌‌ దుకాణంలో ఫొటో మాత్రం కేసీఆర్‌‌‌‌ది పెట్టుకుంటున్నరు. ఫ్రీ వ్యాక్సిన్‌‌‌‌ కేంద్రం ఇస్తున్నది. దాని గురించి కేసీఆర్‌‌‌‌ కనీసం ఇప్పటి దాకా మాట్లాడలేదు. మోడీ పేరు ఎత్తాల్సి వస్తదని ఆయనకు  భయం. మిషన్‌‌‌‌ భగీరథకూ అమృత్‌‌‌‌ స్కీం నుంచే  నిధులొచ్చినయ్​. ఇట్ల అన్నిట్లో కేంద్రం నిధులే  ఉన్నయ్​.  కేంద్రం ఇచ్చే నిధులను కూడా ఇక్కడ దారి మళ్లిస్తున్నరు.  ప్రజలను పిట్టకథలతో కేసీఆర్‌‌‌‌ వంచిస్తున్నరు. ధనిక రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రంగా మార్చిన్రు. ఇన్​స్టాల్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో జీతాలు ఇస్తున్నరు. ఇదేనా కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం. ప్రజలకు వాస్తవాలను వివరించడానికే యాత్ర చేస్తున్న. కొంత మంది నిక్కచ్చిగా ఉన్న ఆఫీసర్లు డ్యూటీ చేయలేకపోతున్నరు. బ్యూరోక్రాట్స్‌‌‌‌లో చాలా మంది టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు అనుకూలంగా మారిపోయిన్రు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి, బెదిరింపులతో విధులు సరిగా చేయలేపోతున్నరు. సీఎంవోలో రిటైర్‌‌‌‌ అయిన ఐఏఎస్‌‌‌‌, ఐపీఎస్‌‌‌‌లను పెట్టుకున్నరు. 
బీజేపీ, కాంగ్రెస్​  జోష్‌‌‌‌ పెంచాయి.. వ్యతిరేక ఓట్లు చీలితే మళ్లీ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కే లాభం కాదా..?
ఈ సారి ప్రజలు అలాంటి తీర్పు ఇవ్వరు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ. ప్రజలు అన్ని విషయాలను గ్రహిస్తున్నరు. పోడు భూములు, నిరుద్యోగుల సమస్యలు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి కోసం కొట్లాడి జైలుకెళ్లినం. అరాచక పాలనను ఎదుర్కొనే ముందుకు వెళ్తున్నం. అంతిమంగా ప్రజలే తేలుస్తరు. దేశంలో మోడీ ఆధ్వర్యంలో సాహసోపేతమైన, అవినీతి రహిత పాలన నడుస్తున్నది. అందుకే ప్రజలు బీజేపీని నమ్ముతున్నరు. బీజేపీకి ఒక్క చాన్స్‌‌‌‌ ఇవ్వాలని వారిని కోరుతున్నం.
మరో 20 ఏండ్ల దాకా టీఆర్‌‌‌‌ఎస్సే ప్రభుత్వంలో ఉంటదట కదా?
టీఆర్‌‌‌‌ఎస్​కు అంత విశ్వాసమే ఉంటే హుజూరాబాద్‌‌‌‌లో ఎందుకింత జిమ్మిక్కులు చేస్తున్నది? ఇన్నాళ్లూ కేసీఆర్‌‌‌‌  పిట్టకథలు చెప్పి, జిమ్మిక్కులు చేసి ప్రజలను మభ్యపెట్టిన్రు. ఇప్పుడు ఆ మాటలను జనం నమ్మే పరిస్థితిలో లేరు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఇప్పుడు ఓటు బ్యాంక్‌‌‌‌  లేదు. దేశంలో అత్యంత అవినీతి పరుడు కేసీఆరే. కేసీఆర్‌‌‌‌ను ఎప్పుడు జైలుకు పంపాలో మాకు తెలుసు. కేసీఆర్‌‌‌‌, ఆయన మంత్రి వర్గం, ఎమ్మెల్యేలందరి చిట్టా మా దగ్గర ఉంది. అవినీతిపరులు ఎంత మంది ఉంటే, ఎంత మంది ఆధారాలు దొరికితే అంతమందిని జైలుకు పంపుతం.
ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ కావాలి
రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావాలని బీజేపీ జాతీయ నేతలు ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేశ్ బిదురే, కమిటీ సభ్యులు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు భారతీ బెహన్, ప్రధాన కార్యదర్శి దిలీప్ సైకియాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం నుంచి చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్ర గురించి సంజయ్​ని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర ఉద్దేశాలు, లక్ష్యాలతోపాటు రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకుని సంజయ్​ని 
అభినందించారు.

Tagged Bjp, Bandi Sanjay, Today, Yatra,

Latest Videos

Subscribe Now

More News