కేటీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించే దురుద్దేశాల్లేవు : బండి సంజయ్‌

కేటీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించే దురుద్దేశాల్లేవు : బండి సంజయ్‌

తనపై మే నెల రెండోవారంలో మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమాధానం ఇచ్చారు. కేటీఆర్ వ్యక్తంచేసిన ఆందోళన ఊహాజనితం మాత్రమేనని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులకు అది పూర్తి విరుద్ధమైందని తెలిపారు. మే 11న తాను ట్విట్టర్ లో పెట్టిన పోస్టు.. 27 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వచ్చిన స్పందన అని పేర్కొన్నారు. అందులో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠకు, గౌరవానికి భంగం కలిగించే దురుద్దేశాలు ఏవీ లేవన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యతను గ్లోబరీనా సంస్థకు కట్టబెట్టడంలో  రాష్ట్ర సర్కారు పక్షపాత వైఖరితో వ్యవహరించిందని బండి సంజయ్ తన పిటిషన్ ద్వారా బదులిచ్చారు.

ఇంటర్ ఫలితాల విడుదల ప్రక్రియలోనూ ఎన్నో పొరపాట్లు జరిగాయన్నారు. గ్లోబరీనా వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్, సంబంధిత శాఖ మంత్రి బాధ్యత వహించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం రాజధర్మాన్ని విస్మరించిందని సంజయ్ పేర్కొన్నారు. ‘మోడీ కార్పొరేట్ సంస్థల సేల్స్ మెన్’, ‘మోడీకి తేడా బీమారీ’, ‘ఆ దొంగలు కొంటలేరు’  అంటూ గతంలో సీఎం కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని తన పిటిషన్ లో ప్రస్తావించారు. ‘‘ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు మంత్రి కేటీఆరే కారణం’’ అని మే నెల 11న ట్విట్టర్ వేదికగా  బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై అప్పట్లో స్పందించిన మంత్రి కేటీఆర్.. ‘‘ ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే పరువు నష్టం దావా వేస్తాను’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం పరువుకు నష్టం కలిగించారంటూ తన న్యాయవాది ద్వారా బండి సంజయ్ కి నోటీసు పంపించారు. ఈ నోటీసుకే ఇవాళ బండి సంజయ్ సమాధానం ఇచ్చారు.

కేసీఆర్ నీ కార్యకర్తలను కంట్రోల్ చెయ్ : సంజయ్

నల్గొండ జిల్లా :  చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు సమాధి నిర్మించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘కేసీఆర్ నీ కార్యకర్తలను కంట్రోల్ చెయ్.. లేకపోతే ఫామ్ హౌస్ లో కూర్చో’’ అని వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లిలో నిర్వహించిన  బీజేపీ ప్రచార సభలో బండి సంజయ్ మాట్లాడారు.  మునుగోడుకు ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు  మంజూరు కాలేదన్నారు.  ప్రజల గోస పట్టని కేసీఆర్ కు అధికార పీఠంపై ఉండే అర్హత లేదన్నారు. ‘‘అయ్య ఢిల్లీ లో.. కొడుకు ట్విట్టర్ లో.. బిడ్డ లిక్కర్ లో.. సడ్డకుడు కమిషన్లలో మునిగిపోయారు. వీళ్ల ఒక్కొక్కరి చరిత్ర మా దగ్గర ఉంది’’ అని ఆయన కామెంట్ చేశారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి కి కబ్జాలు, కమిషన్ల చరిత్ర లేదన్నారు.