మోడీ టూర్ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ వెనుక..? 

మోడీ టూర్ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ వెనుక..? 

మండే ఎండలకు తోడు.. రాష్ట్రంలో రాజకీయం వాతావరణం మరింత హీటెక్కింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (tspsc) పేపర్ లీకేజీ ఇష్యూ రగడ రాజుకుంటున్న సమయంలోనే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ మరింత తీవ్ర దుమారం రేపుతోంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్ విచారణ చేస్తున్న సమయంలోనే... టెన్త్ క్లాస్ హిందీ పేపర్ వాట్సాప్ లో బయటకు రావడం కలకలం రేపింది. హిందీ పేపర్ బయటకు రావడం వెనుక బండి సంజయ్ కుట్ర ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల8న (ఏప్రిల్ 8న) ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న సమయంలో బండి సంజయ్ అరెస్ట్ మరింత దుమారం రేపుతోంది. 

మోడీ టూర్ ను అడ్డుకునేందుకేనా..? 

మోడీ టూర్ ను అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈనెల 8న రాష్ట్రానికి రానున్న మోడీ.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణతోపాటు పలు రైల్వే, రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనితోపాటు పరేడ్‌ గ్రౌండ్స్‌ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోడీ హాజరయ్యే పరేడ్‌గ్రౌండ్స్‌ సభకు బీజేపీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో భారీస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే జనసమీకరణపై దృష్టి పెట్టిన పార్టీ నాయకత్వం.. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను, ప్రజలను తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. సభలో ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొననున్న నేపథ్యంలో భారీస్థాయిలో సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాలని భావిస్తున్న సమయంలో బండి సంజయ్ అరెస్ట్ మరింత అగ్గి రాజేసింది. 

బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య పొలిటికల్ వార్ 

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారిస్తుండటం.. కవితను ఈడీ అరెస్టు చేస్తుందనే ప్రచారం, రాష్ట్రంలో సంచలనంగా మారిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు, దానిపై బీఆర్‌ఎస్‌–బీజేపీ నేతల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ వ్యూహారచన చేస్తోంది. బీఆర్‌ఎస్‌ సర్కారు, సీఎం కేసీఆర్‌ కుటుంబం, ఆ పార్టీ నేతలపై దూకుడుగా విమర్శలు, ఆరోపణలు చేస్తోంది. ఇటు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై కేసీఆర్ సర్కార్ పై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. 

ఉత్కంఠ రేపుతున్న మోడీ టూర్ 

మరోవైపు..  బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు, ప్రత్యారోపణలతో రాష్ట్ర బీజేపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో మోడీ రాష్ట్ర పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బహిరంగ సభలో ప్రధాని ఏం మాట్లాడుతారు...? ఎలాంటి విమర్శలు చేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. కొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మాట్లాడే అంశాలు, ఆ తర్వాత జరిగే పరిణామాలు.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని టూర్ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.