మీకు మరో 4 నెలలే టైమ్.. తుపాకులు వదిలి బయటకు రండి: మావోయిస్టులకు కేంద్రమంత్రి బండి పిలుపు

మీకు మరో 4 నెలలే టైమ్.. తుపాకులు వదిలి బయటకు రండి: మావోయిస్టులకు కేంద్రమంత్రి బండి పిలుపు

హైదరాబాద్: మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్‎పై కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (నవంబర్ 18) వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అయినప్పటికీ ఏరి పారేశామని.. ఇప్పుడు హిడ్మా, ఆయన భార్య సాధించిందేటని ప్రశ్నించారు. మావోయిస్టులతో దేశానికి, రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా.. మైనర్లకు తుపాకులు ఇచ్చి అడవులకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. 

‘‘అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జల్సా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడగట్టుకుని కార్లలో తిరుగుతున్నారు. వాళ్ల మాటలు నమ్మి అమాయకులు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరుగుతూ తిండీ తిప్పలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అర్బన్ నక్సల్స్ చెప్పేదొకటి. చేసేదొకటి. మావోయిస్టుల మరణాలకు అర్బన్ నక్సల్సే కారణం. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. 

మంచి ఆలోచనలతో సమాజంలోకి రండి. ప్రజలకు సేవ చేయండి’’ అని పిలుపునిచ్చారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవడానికి  మరో 4 నెలల సమయం మాత్రమే ఉందని, 2026 మార్చినాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. మావోలు లొంగిపోయేంతవరకు ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్‎లోని అల్లూరి జిల్లా రంపచోడవరం పరిధిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 2025, నవంబర్ 18న జరిగిన భారీ ఎన్ కౌంటర్‎లో మావోయిస్ట్ అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే అలియాస్ రాజక్కతో పాటు మరో నలుగురు ఎన్ కౌంటర్‎లో మృతి చెందారు. మావోయిస్టు పార్టీలో శక్తివంతమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్ 1కి కమాండర్‎గా ఉన్న హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ. ఇప్పటికే నంబాల, చలపతి, భాస్కర్ రావు వంటి అగ్రనేతలు ఎన్ కౌంటర్లో హతం కాగా.. తాజాగా హిడ్మా కూడా అసువులు బాయడం మావోయిస్ట్ పార్టీ ఉద్యమానికి తీరని నష్టంగా మారనుంది.