హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ఫలితంపై బీజేపీలో అంతర్మథనం మొద లైంది. లోపం ఎక్కడ జరిగింది..? బాధ్యత ఎవరిది..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోకల్ ఎంపీ కావడం, అభ్యర్థి ఎంపిక మొదలు, ప్రచార బాధ్యతలను ఆయనే చేపట్టడంతో ఓటమికి కూడా ఆయనే బాధ్యత వహించాలని పలువురు నేత లు అభిప్రాయపడుతున్నారు. కానీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపలేదనే వాదనలున్నాయి. నామి నేషన్ గడువు ముగిసే ముందు వరకు అభ్యర్థిని ఫైన ల్ చేయకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేస్తుండగా... బీజేపీ అభ్యర్థి ఎంపికలోనే తలమునకలు కావడంతో కార్యకర్తలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టార్ క్యాంపెయినర్లలో చాలా మంది ఇటువైపు కన్నెత్తి చూడలేదు. వారిని రప్పించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా ఆసక్తి చూపలేదనే వాదనలున్నాయి. మరోవైపు ప్రచార గడువు ముగిసే మూడు రోజుల ముందు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చి.. ఓట్ల పోలరైజేషన్ కు తీవ్రంగా ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు.
హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్టానం అన్నీ తానై వ్యవహరించింది. కానీ, కీలకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మాత్రం నిర్లక్ష్యం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్కు అవయవదానం చేయడానికే బీజేపీ ఆత్మహత్య చేసుకున్నదంటూ సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా.. బీజేపీ అగ్రనేతలు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాంచందర్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
